హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కేటీఆర్ మొదటి నుంచీ చెప్తున్నారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి లేదని, విచారించదగిన పస లేదని, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత దృష్టి మరల్చేందుకు తన అనుకూల మీడియాతో ఈ కేసును వండి వార్చుతున్నారని చెప్పారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్.. సోమవారం కూడా విచారణకు రానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్‌ను విచారించిన అధికారి డీఎస్పీ మాజీద్‌ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్‌రెడ్డి సహా మరో ఇద్దరు కొత్త అధికారులు సోమవారం విచారించనున్నట్టు తెలిసింది. మొత్తం ఆరుగురు విచారణాధికారులు కేటీఆర్‌ను విచారిస్తారని సమాచారం.
సీఎం డైరెక్షన్లోనే విచారణ?
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కక్ష పెంచుకున్న రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే.. ఎలాగైనా కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఫార్ములా-ఈ కార్ రేసు కేసును పథకం ప్రకారం తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఖజానాకు వందల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిన ఫార్ములా-ఈ రేసును పథకం ప్రకారమే రేవంత్ రద్దు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రేస్‌ను రద్దు చేసిన నాటి నుంచి ఏసీబీతో విచారణ చేయించడం, ఎలాగైనా ఈ కేసును అడ్డం పెట్టుకొని కేటీఆర్‌ను జైలుకు పంపాలనే దురుద్దేశంతోనే ఉన్నారని ఇటు బీఆర్ఎస్ వర్గాలు సైతం చెప్తున్నాయి. అనుభవరాహిత్యంతో పాలనలో వరసగా తప్పిదాలు చేస్తున్న తనను కేటీఆర్ ప్రతిరోజూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఎప్పటికైనా కేటీఆర్‌తో ప్రమాదమేనని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఎలాగైనా కేటీఆర్‌ను అరెస్టు చేయించాలనే భావనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ కేసును తన ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ఢిల్లీలో రహస్య మంతనాలు..
కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో ఇరికించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. 18 నెలలుగా కేవలం ఈ ఒక్క కేసుపైనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఒక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్న విషయం తెలిసిందే!
కేటీఆర్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపాలని పోలీసు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ ఏసీబీకి చెందిన ఓ ముఖ్య ఉన్నతాధికారిని ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడికి పిలిపించుకొని మాట్లాడారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిద్దరూ, ఢిల్లీకి కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు న్యాయ నిపుణులు ఈ అంశంపై కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. అయితే, కేటీఆర్‌ను ఇప్పటికిప్పుడు అరెస్టు చేస్తే.. జరిగే పరిణామాలపై కూడా ఢిల్లీలో చర్చించినట్టు సమాచారం. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు నుంచి.. తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆ కేసును సమర్థంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించగల సీనియర్ న్యాయవాదులు ఎవరున్నారు? వారికి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి? ఎలాంటి ఆధారాలు సమర్పించాలి? అనే కోణాల్లోనే ఢిల్లీలో మంతనాలు సాగించినట్టు సమచారం. కేటీఆర్‌ను కనీసం 60 రోజులకు పైగా జైల్లో ఉంచాలనేది వారి చర్చల సారాంశంగా తెలిసింది.
గతంలో రెండుస్లారు విచారణకు..
ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌ను లాయర్‌తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయటే అడ్డుకున్నారు. తాను కచ్చితంగా లాయర్తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటిరోజు విచారణకు హాజరైనట్టు లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదేరోజు సాయంత్రం మళ్లీ నోటీసులిచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్‌తో వచ్చిన కేటీఆర్‌ను జనవరి 9న నలుగురు విచారణాధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేస్ నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే.. ఫార్ములా ఈ-కార్ రేస్‌ను నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశానని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్‌ను విచారించింది.
1500 మందితో బందోబస్తు..
కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల, నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికిపైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచే బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారు 1500 మందికిపైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తారని తెలిసింది.