మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కార్పొరేషన్, జూలై 19: వానకాలం పంటలకు ఇవ్వాల్సిన రైతుభరోసాను ఎగ్గొట్టి ఆ నిధులతో రుణమాఫీ చేసిందని ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ధ్వజమెత్తారు. లక్ష రుణమాఫీలోనూ కోతలు పెట్టి రూ.2 లక్షలు అంటూ అబద్ధాలు చెబుతున్నదని విమర్శించారు. రైతుభరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్మే రూ.20 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల రైతులు లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే రుణమాఫీకి ఎం పికచేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 2014లో కేసీఆర్ లక్షలోపు రుణాలు తీసుకున్న 35 లక్షల మందికి 16,144 కోట్లు వెచ్చించారని, 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలని వెల్లడించారు.