హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హాయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే ఈ సర్కారు ఫలితాలను విడుదల చేసి, నియామకపత్రాలు ఇచ్చిందని, ఇదంతా తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘సీఎం రేవంత్ నియామక పత్రాలు ఇవ్వడం కాదు.. దమ్ముంటే ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు పరీక్షలు నిర్వహించారో?’ చెప్పాలని సవాల్ విసిరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అసలే అవగాహన లేదని, సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు నట్టేట ముంచుతున్నదని విమర్శించారు. ఉద్యోగ నియామకాల విషయంలో కేసీఆర్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 2.30 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, సేవలు తదితర ప్రైవేట్ రంగాల్లో యువతకు సుమారు 15 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరికాయని తెలిపారు.