జగిత్యాల, జనవరి 3: ‘ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా రోళ్లవాగును పట్టించుకున్నారా?.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు గుర్తొచ్చిందా?’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాలని 2016లో అప్పటి సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత, తన ఆధ్వర్యంలో నిర్ణయించినట్టు గుర్తుచేశారు. ప్రాజెక్టు ఆధునీకరణతో సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 17 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని నిర్మించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం దాదాపు 40ఏండ్లు అధికారంలో ఉ న్నా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అం దించాలని ఏనాడూ ఆలోచన లేదని విమర్శించారు.
ఈ ప్రాంతం నుంచి పలుమా ర్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన వారు కూడా దీని గు రించి ఆలోచన చేయలేదని తెలిపారు. తెలంగా ణ వచ్చాక జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 14 లిఫ్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ లిఫ్ట్‌లు, రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు నీరందించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 2016లో రోళ్లవాగు ప్రాజెక్టును ప్రారంభించామని, 1/4 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకు దీని సామర్థ్యాన్ని పెంచామని, దీంతో 17 వేల ఎకరాలకు సాగునీరందినట్టు పేర్కొన్నారు. రెవెన్యూ భూమి 279, అటవీ భూమి 850 ఎకరాలు ప్రాజెక్టు పరిధిలోకి రావడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగినట్టు తెలిపారు. అనుమతుల కోసం పంపించినా ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరిలోకి నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు పూర్తిచేసి సాగునీరందించాలని సూచించారు.