హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు దివ్యాంగులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా అమలుచేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని ఓట్లు దండుకొని ఇప్పుడు హక్కుల కోసం రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చిందని బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. 2024 అక్టోబర్ నాటికి 5,14,422 మంది దివ్యాంగులకు పెన్షన్స్ వస్తే ప్రస్తుతం 4,90,044 మందికి మాత్రమే పెన్షన్స్ వస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దివ్యాంగుల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని మైలురాళ్లుగా నిలిచాయని కొప్పుల గుర్తుచేశారు. దివ్యాంగుల ఫించన్లు రూ.500 నుంచి రూ.4,016కు పెంచడమే కాకుండా వారికి ఉన్న 3శాతం రిజర్వేషన్ను 4శాతానికి పెంచింది దేశంలో కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.