హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం కాంగ్రెస్ నిర్వహించింది విజయోత్సవ ర్యాలీ కాదని, అహంకారంతో కూడిన ర్యాలీ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో అహంకారాన్ని ప్రదర్శించడం సరైంది కాదని హితవు పలికారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిబంధనలన్నీ అతిక్రమించి ఎన్నికల్లో గెలిచారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం, మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆడబిడ్డపై అన్ని పార్టీలు ఏకమై కోట్లాది రూపాయల ఖర్చు చేసిన గెలుపు గెలుపే కాదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై ఓట్లను కాంగ్రెస్కు మళ్లించాయని ఆరోపించారు.