ఆదిలాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): చనాక-కొరాట ప్రాజెక్టు శుద్ధి కోసం బయలుదేరుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చనాక-కొరాట ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించి కాలువల్లోని నీటిని వదిలారు. ఈ నేపథ్యంలో జోగు రామన్న ప్రాజెక్టు శుద్ధికి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జోగు రామన్న ఇంటివద్ద పోలీసులు మోహరించి బయటకు రాకుండా ఆయన్ను అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు రామన్న ఇంట్లోకి ప్రవేశించి కుటుంబసభ్యులు, కార్యకర్తలు వారించినా బలవంతంగా బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను జోగు రామన్న ఖండించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి చనాక-కొరాట ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో మోటర్ల బటన్ నొక్కి ఆన్ చేసినా ఎకరాకు కూడా సాగునీరు అందే అవకాశం లేదని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రాజెక్టు వద్ద శుద్ధి కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వం అరెస్ట్‌లకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా రైతుల పక్షాన ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.