మంచిర్యాల, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో రంగుమారిన సోయా పంటను కొనుగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తి కొనాలని, యాసంగి పంటలకు నిరంతర విద్యుత్తు అందించాలని, సంక్రాంతిలోగా రెండో పంటకు రైతు భరోసా విడుదల చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రీ జాతీయ రహదారి 353 (బీ) వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించగా పోలీసులు జైనథ్ మండలం కేంద్రంతో పాటు బేల మండలంలో వాహనాలను నిలిపివేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయాబీన్‌ను కేంద్ర ప్రభుత్వమే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుందని, పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల రోజుల పాటు నామ్కేవాస్తేగా పంటను సేకరించి మూసివేశారని తెలిపారు. పంటను కొనాలంటూ బీఆర్ఎస్, రైతులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటకు వచ్చినప్పుడు సోయా పంట కొనాలని వినతిపత్రం అందించినట్టు గుర్తుచేశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
50 క్వింటాళ్ల సోయా వచ్చింది. మా గ్రామం పేరు లేదు. దీంతో పంట ఇంట్లోనే ఉన్నది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు కట్టాలి. పంట ఎక్కడ అమ్మాలో అర్థం కావడంలేదు.
– నర్సింగ్‌రెడ్డి, రైతు, బెల్లూరి, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
సోయా 150 కింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను అమ్ముదామన్నా వీలుకాకుండా చేసింది ఈ సర్కారు. మహారాష్ట్రలో ధరలు లేవు. ఇప్పుడు 150 క్వింటాళ్లు తీసుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ఉన్నది.
– బద్దం రాంరెడ్డి, జైనథ్ మండలం