రైతుల జీవితాలు.. తెగిన గాలిపటాలు
సర్కార్ తీరుపై జోగు రామన్న ఫైర్
ఆదిలాబాద్లో బీఆర్ఎస్ వినూత్న నిరసన
ఆదిలాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు తెగిన గాలిపటాలుగా మారాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. విశ్రాంతి భవనం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆందోళకు దిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. అన్నదాతలు రైతుభరోసా అందక, రుణమాఫీ కాక, ఎరువులు దక్కక ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సీసీఐ మద్దతు ధరలో రూ.100 తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసేంత వరకు వెంటాడుతామని హెచ్చరించారు. పోలీసు కేసులకు భయపడేది లేదని, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.