జగిత్యాల, జూలై 27(నమస్తే తెలంగాణ)/జగిత్యాల: జగిత్యాల పట్టణ పరిధిలోని నూకపెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు వంద కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో నూకపెల్లి అర్బన్ కాలనీ ఉన్నది. 2008లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న జీవన్‌రెడ్డి నూకపెల్లి సమీపంలో ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమికి మరో 150 ఎకరాల స్థలాన్ని సేకరించి కాలనీ ఏర్పాటుకు ప్రయత్నించారు. జగిత్యాల పట్టణానికి చెందిన 4 వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పట్టాలు జారీ చేయడంతోపాటు వారికి కాలనీలో కొన్ని సౌకర్యాలు కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీతోపాటు రుణ సౌకర్యం కల్పించింది. దాదాపు 700 మంది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. కొందరు నివాసం ఉంటూ వచ్చారు. చాలామంది ఇంటి నిర్మాణం చేపట్టినా, డబ్బులు సరిపోక పనులు పూర్తి చేయలేకపోయారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం నూకపెల్లిలోని ఇందిరమ్మ కాలనీలో అందుబాటులో ఉన్న స్థలంలో 4,520 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
వంద నిర్మాణాల కూల్చివేత
ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు జేసీబీలతో వంద నిర్మాణాలను కూల్చివేయడం కలకలం సృష్టించింది. దీనిపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణకు సంపద్రించగా ఆమె స్పందించలేదు.
అధికారులపై జీవన్‌రెడ్డి ఫైర్
కూల్చివేసిన ఇండ్లను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పరిశీలించారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని, నిధుల విడుదల సమయంలోనే ఇలా చేయడం కేవలం రాజకీయ లబ్ధికోసమేనని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ పట్టణంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.