జగిత్యాల, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడి గుర్తును ఎత్తుకొనిపోయారని వ్యాఖ్యానించారు. ‘నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిలువాలా? వద్దా? ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. ప్రజల కోసం నిలబడి కొ ట్లాడుతా’ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయ న జగిత్యాల జిల్లా కేంద్రంలోని 24, 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులకు (ఒరిజినల్ కాంగ్రెస్) మద్దతుగా ప్రచారం చేశారు.
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ మారితే వాళ్లను రాళ్లతో కొట్టాలని నాడు పీసీసీ హోదా లో రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇప్పుడేమో ముఖ్యమంత్రి హోదాలో పార్టీ మారినోళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున కౌన్సిలర్ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. జీవితంలో కాంగ్రెస్‌కు ఓటేయని వారికి టికెట్లు ఇస్తే పోరాటం చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అందుకే తాను ఇప్పుడు ఓట్లతో కొట్టాలని చెప్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో ఎన్నికలు చిత్రంగా మారాయని, ఎవరు ఏ పార్టీ అనేది తెలియని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు పవిత్ర, జమున, పులి రాము పాల్గొన్నారు.