జగిత్యాల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎలాంటి వాణిని వినిపించానో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైతం అదే స్థాయిలో సమస్యలపై మండలిలో ప్రస్తావించానని గుర్తుచేశారు. చచ్చేదాకా ప్రజల పక్షాన పోరాడుతానని, రానున్న రోజుల్లో పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన ఆయన.. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంలో శాసన శాఖతోపాటు, కార్యనిర్వాహక శాఖ అత్యంత కీలకమైందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విరమణ వయసు 58 నుంచి 61కి పెంచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మద్దతునిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విరమణపొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన డబ్బుల కోసం పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మూడేండ్ల క్రితం ఇవ్వాల్సిన పీఆర్సీని ఇంతవరకు ఏర్పాటుచేయకపోవడం శోచనీయమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐదుశాతం ఐఆర్పైనే ఉద్యోగులు కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకం కింద ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి 1.5 శాతం వాటాను తీసుకొని.. ప్రభుత్వం 1.5 శాతం వాటా కలిపి స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సరికాదని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి శాసనమండలిలో ప్రజాగొంతుకగా నిలిచానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు పనిచేయని నేపథ్యంలోనే పార్టీని వీడివచ్చానని వివరించారు. 2019లో ఎమ్మెల్సీగా పోటీచేసిన సమయంలో పట్టభద్రులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుదోగ్య యువత శాసనమండలిలో సమస్యలపై ప్రశ్నించే గొంతుక అవుతాడన్న నమ్మకంతోనే ఆదరించారని చెప్పారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్లో సభలు పెట్టి, ప్రచారం నిర్వహించినా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని ఎద్దేవాచేశారు. 2004లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని చెప్పారు. ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ లేదా… పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అన్ని రాష్ర్టాలు అమలు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అమలు చేయలేదని చెప్పారు. శాసన మండలిలో ఈ విషయమై చర్చ జరిగినప్పుడు త్వరలోనే ఉద్యోగులకు పెన్షన్ విషయంలో ఆప్షన్ ఇస్తామని అప్పటి ఆర్థిక కార్యదర్శి, ఇప్పటి చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చినా ఇంత వరకు అమలుకాలేదని మండిపడ్డారు.