సూర్యాపేట, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర రైతాంగం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పత్తి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ పత్తి రైతుల విషయంలో కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో వరి పండించే రైతులకు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నది. పత్తి, వరి రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడండి’ అని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేటకు వచ్చిన గవర్నర్‌ను కలెక్టరేట్లో జగదీశ్‌రెడ్డి కలిసి రైతుల సమస్యలను వివరించి, వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పత్తి చేతికి వస్తుండటంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. వరదల్లో నష్టపోయిన పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అదే సమయంలో పత్తికి సంబంధించి రాష్ట్రం పట్ల కేంద్రం కూడా వివక్ష చూపిస్తున్నదని పేర్కొన్నారు. వాస్తవానికి గుజరాత్లో పండించే పత్తి కంటే తెలంగాణలో పండించే పత్తి నాణ్యమైందని అనేక సందర్భాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించినట్టు గుర్తుచేశారు.
గుజరాత్లో మాదిరి తెలంగాణ రైతాంగానికి క్వింటా పత్తి రూ.8,257 లెక్కన మద్దతు ధరను ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.475 బోనస్‌ను అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది అకాల వర్షాలతో సరైన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం అందించాలని కోరారు. ఇప్పటివరకు సీసీఐ కేంద్రాలను ప్రారంభించలేదని, అక్కడక్కడా ఒకటి, రెండు కేంద్రాలు తెరిచినప్పటికీ వచ్చిన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉన్నదని కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు క్వింటాలు పత్తిని 5వేలకు దళారులకు అమ్ముకొని దోపిడీకి గురవుతున్నారన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు సరిగ్గా లేవని తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోవాలని గవర్నర్‌కు మెమొరాండం అందజేసినట్టు వెల్లడించారు.