సూర్యాపేట, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95ఏండ్ల వయసులో సర్పంచుగా గెలిచి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే సొంతూరు సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా రామచంద్రారెడ్డి బరిలో ఉండడం ద్వారా రాష్ట్రంలోనే సెన్సేషన్‌గా నిలవగా.. ఆయన గెలవడం రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మకమైన సరికొత్త రికార్డు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో గెలువకుండా నిలువరించాలని సర్వశక్తులు ఒడ్డినా కాంగ్రెస్‌కు పరాభవమే దక్కింది. కాంగ్రెస్ పార్టీ జగదీశ్‌రెడ్డి తండ్రి పోటీ చేస్తున్న నాగారం సర్పంచ్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి జగదీశ్‌రెడ్డి తండ్రిని ఓడించేందుకు గ్రామంలో దాదాపు మూడు కోట్లకు పైనే ఖర్చు చేశారని గ్రామస్తుల అంచనా. ఇంత జరుగుతున్నా జగదీశ్‌రెడ్డి మాత్రం కూల్‌గా ఉంటూ గ్రామానికి తన తండ్రి ఎనిమిది దశాబ్దాలుగా చేసిన సేవలు, చేపట్టిన పనులకుతోడు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తమ కుటుంబంపై సానుభూతి ఉంటుందని నమ్మారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురు గాలి వీచినా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన జగదీశ్‌రెడ్డి ఎన్నికల కోసం గ్రామానికి వెళ్లకుండా కేవలం వ్యూహం రూపొందించి అమలు చేయించడంతోపాటు ఓ సర్పంచ్ అభ్యర్థి ఖర్చు చేయాల్సిన పరిమితిని కూడా దాటకుండా తండ్రిని గెలిపించుకొని సత్తాచాటారు.