‘డెకాయిట్’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉత్తమ్‌కు మతి భ్రమించినట్టున్నదని, రాష్ట్రంలో నోట్ల కట్టలతో దొరికిన దొంగలే డెకాయిట్లు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే తగ్గిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణను, పదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను అలా అనేందుకు ఉత్తమ్‌కు నోరెలా వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ నిలదీశారు.
‘ఉత్తమ్ తనకు తాను ముఖ్యమంత్రిగా ఊహించుకొని రేవంత్‌రెడ్డిలా బూతులు మాట్లాడుతున్నాడా? లేక రేవంత్‌రెడ్డిని మించి కేసీఆర్‌ను తిడితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడా? రాజాగోపాల్‌రెడ్డి పొగడ్తలకు ఉబ్బిపోయి సీఎం పదవిపై కలలుకంటున్నడా’ అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దెప్పిపొడిచారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహనే లేదని, అందుకే కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నారని, మంత్రి ఉత్తమ్ చిల్లరమాటలు మాట్లాడుతున్నారని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సహా, బీఆర్ఎస్ ముఖ్యనేతలు విరుచుకుపడ్డారు.
Jagadish Reddy | సూర్యాపేట, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతున్నదని, నోట్ల కట్టలతో దొరికిన దొంగలే పాలకులయ్యారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేసీఆర్‌ను డెకాయిట్ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే ప్రభుత్వం అంతు చూస్తారని హెచ్చరించారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. లక్షలాది రూపాయల ముడుపులు ఇవ్వజూపి మీడియాకు అడ్డంగా దొరికిన వ్యక్తి ఒకరు, వాహనంలో వెళ్తూ నోట్ల కట్టలు కాలిపోయి న ఘటనకు సంబంధించిన మరొకరు నేడు పాలకులు కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని పే ర్కొన్నారు.
ఉత్తమ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బహుషా సీఎం పదవి దక్కలేదనే బాధ అలా మాట్లాడిస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ అంత చేతగాని మంత్రి మరొకరు లేరని, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నీటిని కూడా ఇవ్వలేక దద్దమ్మలా ఉండిపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నిండుగా ఉండి.. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నా..
కాల్వల్లో సగం నీళ్లు కూడా రావడం లేదని జాన్‌పహాడ్, పాలకీడు, కనగల్ తదితర ప్రాంతాల రైతుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. మరో మంత్రి నియోజకవర్గమై న నల్లగొండలో.. రెండు రోజులపాటు నీళ్ల కోసం రైతులు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. సాగునీటి ధర్నాలు ఇలాగే కొనసాగితే.. యాసంగి నాటికే కాంగ్రెస్ మంత్రులు ప్రజల్లో తిరుగలేరని హెచ్చరించారు.
కాళేశ్వరంపై ఇప్పుడేం చెప్తారు?
బీఆర్ఎస్ హయాంలో ఐదేండ్లపాటు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలు వస్తే.. అవి కాళేశ్వరం కాదు, తాము నిర్మించిన ఎస్పారెస్పీ నీళ్లు అన్న కాంగ్రెస్ నేతలు.. నేడు ఏం సమాధానం చెప్తారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తికి నీళ్లు ఎందుకు రావడం లేదో చెప్పాలని కోరారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపును ప్రారంభించి లోయర్ మానేరు కింద ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం విషయంలో కూడా తప్పుడు మాటలు మాట్లాడి కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నవారు.. అదే ప్రాజెక్టు పంపులు ఎలా ఆన్ చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, ఆ సమస్యలపై త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.