హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ నీటిహక్కులపై సోయిలేని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి తీరని ద్రోహం చేస్తున్నడు.. పదవిని కాపాడుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమై గోదావరి, కృష్ణా జలాలు అప్పగిస్తున్నడు.. ఆయన డైరెక్షన్లో సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి గురువుకు సంక్రాంతి కానుకగా నల్లమలసాగర్ ప్రా జెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నడు’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అనుకున్నట్టే మన నీటిహక్కులను కాలరాస్తున్నారని నిప్పులు చెరిగారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించిందేంటని నిలదీశారు. సోమవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, కిశోర్గౌడ్తో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
బనకచర్ల ఎక్కడ ఉన్నదో, నల్లమల ఏ బేసిన్‌లోకి వస్తుందో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. తన గురువైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రానికి చారిత్రక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనావ్యవహారాలు పక్కనబెట్టి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లమలసాగర్ విచారణ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం శోచనీయమని పేర్కొన్నారు.
హంగూఆర్భాటాలతో వెళ్లిన ఆయన సాధించిందేంటని, తెల్లముఖంతో లోపలికి వెళ్లి నల్లముఖంతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌ను ఉత్తరకుమారుడిని చేసేందుకే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పంపించారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. నల్లమలపై కోర్టు తలుపుతట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, పాలమూరు ప్రాజెక్టుకు అనుమతుల కోసం ఎందుకు వెళ్లడంలేదని నిలదీశారు.
పాలమూరును పూర్తి చేస్తానని, బనకచర్లను అడ్డుకుంటానని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భాలు పలికిన రేవంత్ ఆచరణలో మాత్రం విఫలమయ్యారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాలపై సోయిలేని, పాలనపై పట్టులేని సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నదని పునరుద్ఘాటించారు. నీళ్లపై సోయిలేని నీళ్లమంత్రి, ముఖ్యమంత్రి కలిసి గతంలో కృష్ణా ప్రాజెక్టులను ఢిల్లీ పెద్దలకు అప్పజెప్పివచ్చారని ఆరోపించారు. తమ అధినేత కేసీఆర్ చెప్పిన తర్వాతే కండ్లు తెరచి వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.
సీఎం పదవి కోసం, కేసుల నుంచి బయటపడేం దుకే సీఎం రేవంత్, చంద్రబాబు, ప్రధాని మోదీతో అంటకాగుతున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ ఢిల్లీతో పంచాయితీలు పెట్టుకొని రాష్ట్రానికి నష్టం చేశారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి రెండేండ్లలో ప్రాజెక్టులకు సాధించిన అనుమతులెన్ని.. నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, ఆంధ్రా పెద్దలతో చీకటి ఒప్పందం చేసుకొని తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌కు ప్లాట్ల పొడవు, వెడల్పు తప్ప తెలిసిందేమీలేదని చురకలంటించారు.
పోరాడి తెలంగాణను తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ యే రాష్ర్టాన్ని కాపాడేందుకూ కంకణం కట్టుకుంటుందని జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. మతితప్పిన కాంగ్రెస్ నేతల కండ్లు తెరిపించి రాష్ట్ర ప్రయోజనాలు రక్షించుకుంటామని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి క్లోజ్డ్డోర్లో చంద్రబాబు చెవిలో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయించానని కోతలు కోస్తున్నాడు. మరి అలాంటిది నల్లమలను ఆపాలని బాబు చెవిలో ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులెందుకు తెస్తలేడు? చంద్రబాబు చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు ఎందుకు ఆపుతలేడు?
– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి