సూర్యాపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి చేతకావడం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ, కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నాడని దుయ్యబట్టారు. బుధవారం ఆయన సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘మాటి మాటికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, కాంగ్రెస్ నా యకులు ఈ ఫార్ములా అంటారు. కుంభకోణం జరిగిందంటరు. అదంతా ఉత్తదేనని ప్రజలు గ్రహించారు. అసలు ఈ-ఫార్ములా కాదు యూరియా ఫార్ములా ఎందో చెప్పాలి?’ అని డిమాండ్ చేశారు.
ఓ పక్క రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని, వాళ్ల శాపనార్థాలు ఊరికనే పోవవని హెచ్చరించారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. కరెంట్, కాళేశ్వరం మీద కమీషన్లు, ట్యాపింగ్ కేసు ప్రతిదీ అబద్ధమని తేలిపోయిందని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజలు గుర్రుగా ఉన్నారని తెలిపారు. ఈ-ఫార్ములా, గ్రూప్-1 విషయంలోనూ కాంగ్రెస్ డ్రామాలు బయటపడ్డాయని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని, కేసీఆర్‌ను తిట్టడం, కేసులు పెడుతామనడం ఇక ఈ చిల్లర మాటలు బంద్ చేయాలని సూచించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతోనే మోదీతో రేవంత్‌రెడ్డికి ఉన్న రహస్య బంధం బహిర్గతమైందని తెలిపారు.