పెన్‌పహాడ్, మార్చి 10: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో ఎండిన పంటలను సోమవారం పరిశీలించారు. రైతుల గోడు విని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఎండలకు ఎండిపోతే తనను తిడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సాగు నీరు ఇస్తుందని నమ్మిన రైతులు ఎస్సారెస్పీ కింద వేల ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. తీరా ఇప్పుడు నీళ్లు అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. లక్షల రూపాయలు పెట్టి బావులు తవ్వించినా, బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని, రైతులు మనోవేదన చెందుతుండటం బాధగా ఉందని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కొందరు రైతులు జగదీశ్వర్‌రెడ్డితో మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలు బాగా పండాయని, ఇప్పుడు నీళ్లు లేక అరిగోస పడుతున్నామని వాపోయారు. జగదీశ్‌రెడ్డి వెంట సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.