జయశంకర్ భూపాలపల్లి, జూన్7 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మకమైన సింగరేణి సంస్థ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగమైంది. రోజురోజుకూ రాజకీయ జోక్యం పెరుగుతుండటంతో అవినీతి, అక్రమాలు, కార్మికుల హక్కుల హరింపు కొనసాగుతున్నది. దీనిపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, పలు చోట్ల ప్రాతినిధ్యం సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ నోరుమెదపకపోడంతో బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సింగరేణిలో బొగ్గు స్కామ్‌లను బయటపెడుతూ ‘కాంగ్రెస్ హటావో… సింగరేణి బచావో’ పేరుతో కోల్‌బెల్ట్ బాట పట్టారు. ఆదివారం గోదావరిఖనిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పెరుగుతున్న స్కామ్‌లు.. కానరాని హక్కులు
సంస్థలో కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా బొగ్గు స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు కార్మికుల హక్కులను యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఏప్రిల్‌లో 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్‌ను బీఆర్ఎస్ బయట పెట్టినా ఇంతవరకు ప్రభుత్వం, కేంద్రం నోరుమెదపడం లేదు. విచారణకు ఆదేశించడం లేదు. దీంతో పాటు సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో కోరుకున్న వారికి బొగ్గు బ్లాకులను కట్టబెట్టే కుతంత్రాన్ని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఎండగట్టి పోరాటాలు చేసింది. సీఎం బామ్మర్ది సృజన్‌రెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతున్నదని తెలిసినా, నైని కోల్స్కామ్ను బీఆర్ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాలపై డిప్యూటీ సీఎం టెండర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.54వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి, కొత్త గనులను సంస్థ ద్వారా ప్రారంభించాలనే డిమాండ్ అలాగే ఉంది. మరోవైపు సింగరేణిలో మెడికల్ బోర్డును ప్రభుత్వం పక్కన పెట్టింది. గతంలో కేసీఆర్ కారుణ్యం నియామకాల ద్వారా జాబ్‌లు కల్పించగా, ప్రస్తుతం రేవంత్ సర్కార్ గోల్డెన్ షేక్‌హ్యాండ్ ద్వారా ఇంటికి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12వ వేతన సవరణ ఒప్పందంపై కూడా కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణిలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీతో పాటు మరికొన్ని అమలుకు నోచుకోలేదు.
హరీశ్‌రావు కోల్‌బెల్ట్ బాట
సింగరేణిలో బొగ్గు స్కామ్‌లు, బొగ్గు బ్లాకుల ప్రైవేట్ పరం, కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు కోల్‌బెల్ట్ బాట పట్టారు. ‘కాంగ్రెస్ ‘హఠావో.. సింగరేణి బచావో ’ పేరుతో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం గోదావరిఖనిలో ప్రారంభమైన సదస్సు సింగరేణి వ్యాప్తంగా కొనసాగనున్నది. 12న భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న సదస్సుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
సింగరేణిపై కుట్రలు వివరించేందుకే
సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాం. 12న భూపాలపల్లిలో తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో నిర్వహిస్తాం. ఏరియాల వారీగా తేదీలు త్వరలోనే ప్రకటిస్తాం. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సదస్సుల్లో పాల్గొని కాంగ్రెస్ కుట్రలను కార్మికులకు వివరిస్తారు. సింగరేణి సంస్థలో ఏం జరుగుతున్నది..?అప్పులు…లాభాలు…మెడికల్ బోర్డు, ప్రభుత్వం నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు, బొగ్గు స్కామ్ తదితర అంశాలపై కార్మికులకు అవగాహన కల్పిస్తాం. అలాగే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం
-మిర్యాల రాజిరెడ్డి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు