సిద్దిపేట, ఏప్రిల్ 02( నమస్తే తెలంగాణ ప్రతినిధి): వందరోజుల పాలనను రెఫరెండంగా చూపించి ప్రభుత్వం మనల్ని మోసం చేసే అవకాశం ఉన్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ఎంతసేపు ఢిల్లీకి పోయిరావడం తప్ప ఈ ప్రాంత రైతుల గోస పట్టడం లేదని విమర్శించారు. పార్టీ గేట్లు ఎత్తుడు కాదని, ప్రాజెక్టు గేట్లు తెరవాలని సీఎంకు సూచించారు. మంగళవారం మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వాల నియోజకవర్గపార్టీ సన్నాహక సమావేశంలో మెదక్ లోక్‌సభ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ గేట్లు తెరిచి కూడవెల్లివాగుకు నీళ్లిస్తే గజ్వేల్, దుబ్బాక, ఇతర ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పేగులు మెడలో వేసుకోవడం కాదని, పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్‌రెడ్డిని కోరారు. మానవబాంబు అవడం కాదని, మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటోడ్రైవర్లను ఓదార్చాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 4 వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించి తమకు ఓటువేస్తారని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
హామీలు ఇచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను హామీలపై నిలదీయాలని సూచించారు. గజ్వేల్ గడ్డమీద ఈర్ష్య పెంచుకున్న కాంగ్రెస్, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ బాండ్‌పేపర్ పాలనలో అన్నీ ఉద్దెర మాటేలనని దుమ్మెత్తిపోశారు. రూ. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు, లేదంటే కారుకు ఓటెయ్యాలని కోరారు. డిసెంబర్ నుంచే మన అక్కచెల్లెళ్లకు ప్రతినెల రూ.2500 ఇస్తామన్న మొదటి హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.
కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసింది శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ చెప్పింది వింటే జోడీ, లేకుంటే ఈడీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. పదేండ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రెండింతలు చేసి ఎన్నికలకు ముందు 2 రూపాయలు తగ్గించిందని విమర్శించారు. తెలంగాణ రైతుల కోసం పదేండ్లు కష్టపడి కాళేశ్వరం కట్టి నీళ్లు అందించిన మహనీయుడు మన కేసీఆర్ అని కొనియాడారు. ఈ పదేండ్ల కాలంలో గుంట పొలం కూడా ఎండిపోలేదని గుర్తుచేశారు. నేడు ఎక్కడ చూసినా ఎండిపొలాలు, కాలిపోయిన మోటార్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరుచేస్తే అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మొత్తం రద్దుచేసి గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి బుద్ధిమంతుడైతే గజ్వేల్‌ను రూ.300 కోట్లతో అభివృద్ధిచేసి మేం చేశామని చెప్పుకోవాలని సవాలు విసిరారు. మన నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్‌కు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. గజ్వేల్ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు మనదేనని, తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు వివాదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పులివెందులకు వైఎస్సార్, కుప్పానికి చంద్రబాబు ఎలాగో, గజ్వేల్‌కు కేసీఆర్ అలాగే అని.. గజ్వేల్ కేసీఆర్ అడ్డా అని మరోమారు నిరూపించాలని కోరారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.