హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన వాస్తవ అప్పులు రూ. 4.17 లక్షల కోట్లు అయితే రూ.7 లక్షల కోట్లు అని చెప్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారని, బడ్జెట్లోనూ తప్పుడు లెక్కలు చూపించారని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేసినందుకు భట్టిపై ప్రివిలేజ్‌మోషన్ ఇచ్చినట్టు తెలిపారు. అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ భట్టి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఈ సభలోనే, ఇప్పుడే చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన ప్రివిలేజ్మోషన్కు అనుమతిచ్చి ఈ సమావేశాలు ముగిసేలోపు చర్చ పెట్టాలని స్పీకర్‌ను కోరారు. శాసనసభలో మంగళవారం అప్పులపై ప్రశ్నకు సంబంధించిన చర్చ సందర్భంగా హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమైతదనే విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు అని తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పులు రూ 6.71 లక్షల కోట్లు అని ఒకరు, రూ. 7 లక్షల కోట్లని మరొకరు, రూ. 7.11 కోట్లని ఇంకొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను చాలెంజ్ చేస్తున్నా. అప్పులపై ఒక రోజు మొత్తం చర్చ పెట్టండి. ఆడిటర్లను, ఆర్థికశాఖ అధికారులను ఎవర్ని పిలిచి చర్చ పెడతారో పెట్టండి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 కోట్లు మాత్రమే. కానీ, గోరంతలు కొండంతలు చేసి గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆర్థిక, అప్పుల లెక్కల్లో ఆర్బీఐ కన్నా గొప్పవారు ఉండరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన 4,17,496 కోట్లు కూడా కరోనా సమయంలో కేంద్రం సడలించిన విధానాల వల్లే పెరిగాయని తెలిపారు. కరోనా వల్ల వరుసగా రెండేళ్లు దేశం మొత్తం ఎకానమీ తలకిందులైందని చెప్పారు. అందుకే రాష్ర్టాలు 1.75 శాతం అదనంగా అప్పులు తీసుకొని మూలధన ఖర్చులు చూసుకోవాలని కేంద్రం చెప్పడం వల్లే అదనంగా అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
బీఏసీలో చర్చలేకుండానే సభలో బిల్లులు
బీఏసీలో చర్చించకుండా సభలో బిల్లులు పెట్టడంపై హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బుక్రూల్ ప్రకారం బీఏసీ కమిటీకి అన్ని అధికారులు ఉన్నాయని తెలిపారు. రూల్‌బుక్ ప్రకారం బీఏసీలో చర్చించిన తర్వాతే సభలో బిల్లులు ప్రవేశపెట్టాలని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఏసీలో చర్చించకుండానే రెండు బిల్లులు ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ చేసిన అప్పుల బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో భట్టివిక్రమార్క రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని, హామీలను నెరవేర్చడం తమకు పెద్ద సమస్యే కాదంటూ ఎన్నికలకు ముందు పేర్కొన్న భట్టివిక్రమార్క మాటల్ని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అప్పులు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉచిత విద్యుత్తుకు రూ. 68వేల కోట్లు ఇచ్చాం
బీఆర్ఎస్ హయాంలో ఉచిత విద్యుత్తు కోసం నిధులు ఇవ్వలేదని, వడ్డీలకు ప్రతి నెల రూ. 6 వేలకు పైగా చెల్లిస్తున్నామంటూ భట్టివిక్రమార్క చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు స్పందిస్తూ ఆర్బీఐ ప్రకారం ప్రతినెల రూ. 2,900 కోట్లు, కాగ్ రిపోర్ట్ ప్రకారం రూ. 2,100 కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉచిత విద్యుత్తు కోసం తమ ప్రభుత్వం రూ. 68 వేల కోట్లను విద్యుత్తుశాఖకు చెల్లించినట్టు వివరించారు. ఈ విధంగా 2014-15లో రూ. 2,400 కోట్లు, 2015-16లో రూ. 4 వేల కోట్లు, రూ. 2016-17లో రూ. 3,675 కోట్లు, 2017-18లో రూ. 4 వేల కోట్లు, 2018-19లో 5 వేల కోట్లు, 2019-20లో రూ. 5,100 కోట్లు, 2020-21లో రూ. 10 వేల కోట్లు, 2021-22లో రూ. 11 వేల కోట్లు, 2022-23లో రూ. 11 వేల కోట్లు, 2023-14లో రూ.12వేల కోట్లు బడ్జెట్లో పెట్టినట్టు స్పష్టం చేశారు.
ఆ డబ్బంతా ఏం చేశారు?: వేముల
ఏడాది కాలంలో రూ. 1.27 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్తున్న ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న బిల్లులను కూడా ఎందుకు చెల్లించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, దేవాలయాల నిర్మాణ బిల్లులు, మన ఊరు, మన బడి బిల్లులు.. ఇలా ఎన్నో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త ప్రాజెక్టు కానీ, కొత్త పథకం కానీ ప్రారంభించలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అప్పు చేసి తెచ్చిన లక్ష కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఏడాది అప్పు 1.27 లక్షల కోట్లు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏడాది కాలంలోనే రూ. 1,27,367 కోట్ల అప్పు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ లెక్కన ఐదేండ్లలో అది రూ. 6,36,835 కోట్లు అవుతుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో రూ. 4,17,496 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఐదేండ్ల కాలంలోనే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి నవంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రం చేసిన అప్పులు రూ. రూ. 1,23,368 కోట్లు అని చెప్పారని, కానీ ఈ రోజు(మంగళవారం) తీసుకున్న రుణాలతో కలిపి మొత్తం అప్పు రూ. 1,27,367 కోట్లకు చేరిందని స్పష్టం చేశారు. ఇందులో ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న రుణాలు రూ. 55,277 కోట్లు అని, ప్రభుత్వ గ్యారెంటీల కింద తీసుకున్న రుణాలు రూ. 61,991 కోట్లు అని, గ్యారెంటీలు లేకుండా తీసుకున్న రుణాలు రూ. 10,099 అని వివరించారు.
కేసీఆర్‌తోనే విద్యావ్యవస్థ బలోపేతం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటుచేసి విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలనుస్వాగతిస్తూనే, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది.
-ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 6 వేల స్కూళ్లు మూత
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది కాలంలో 6 వేల సర్కారు బడులు మూతపడ్డా యి. తాము అధికారంలోకి రాగానే మూతపడి న పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో చనిపోతున్నారు.
– ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
గిరిజన రైతులను విడుదల చేయాలి
గిరిజన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది. అరెస్ట్ చేసిన వారిని వెంట నే విడుదల చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డిని గతంలో ఓడించారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. రైతులు కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలుస్తుంది.
– ఎమ్మెల్సీ ఎల్ రమణ
పేదల ఇండ్లపైకి బుల్డోజర్లొస్తే ఊరుకోం
మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకం. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తమంటే ఉరుకోం. డీపీఆర్ లేకుండా రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెప్పారు. మూసీ ప్రాజెక్టుపై మేం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తున్నది. పునరావసం కల్పించిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలి. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
– ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
గురుకులాల ఘటనలపై సీఐడీ విచారణ
రాష్ట్రంలో గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలి. వరుస ఘటనలపై అనుమానాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాల్లో వరుస ఘటనలు దురదృష్టకరం.
– ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్
పొంగులేటి.. బాంబులేటిగా పేరు మార్చుకో! ;మంత్రిపై ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు
పదేపదే ఈ బాంబు, ఆ బాంబు పేలుతుందని చెప్పే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తన పేరు ను బాంబులేటి శ్రీనివాస్‌రెడ్డిగా మార్చుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎద్దేవా చేశారు. ఆయన పేల్చిన బాంబులన్నీ తుస్సుమంటున్నాయని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో కేసులు, కక్షలు తప్ప సాధించిందేమీలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలి అబద్ధాలతో నెట్టుకొస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం, ఫార్ములా-ఈలో స్కాములంటూ కేసీఆర్, కేటీఆర్‌ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
దళితబంధు నిధులను ఫ్రీజ్ చేశారు: కౌశిక్‌రెడ్డి
దళితబంధు పథ కం కింద నిధులు మంజూరైన నిధులను ప్రభుత్వం ఫ్రీ జ్ చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పా డి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ జీరో అవర్‌లో విమర్శించారు. దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 18,500 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇచ్చిందని, రెండో విడుతలో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉన్నదని తె లిపారు. రెండో విడుత నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమకాగా, ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. లబ్ధిదారులకు నిధులను తక్షణమే విడుదల చేయా లన్నారు. నిరసన తెలిపిన దళిత మహిళలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రుల ద్వారానే కేటాయించాలా?: మర్రి
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఇన్చార్జి మంత్రుల ద్వా రా పంపిణీ చేయాలన్న చట్టబద్ధత ఏ మైనా ఉన్నదా? అం టూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రశ్నించారు. ఇన్చార్జి మంత్రుల ద్వారానే ఎస్డీఎఫ్ నిధులను నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని చట్టమేమైనా ఉన్నదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.10 కోట్లు ఇచ్చినా అవి ఇన్చార్జి మంత్రులకు అవగాహన లేక దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేను సంప్రదించకుండా, జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయకుండా ఎలా ఖర్చు చేస్తారని సర్కారును కడిగిపారేశారు.
ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన
బీఆర్ఎస్ సభలో మానవీయ ప్రశ్న లేవనెత్తింది. రైతును బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చారు. దీనిని ప్రతి ఒకరూ ఖండించాలి. ప్రజాస్వామ్యం మా ఏడో గ్యారెంటీ అన్న కాంగ్రెస్.. ఇదేనా మీ ప్రజాస్వామ్యం. రైతుల గురించి మాట్లాడాలంటే టూరిజం పాలసీపై చర్చ చేస్తారట. ఇదేమి పాలన. ఇది ప్రజాపాలన కాదు ప్రజా పీడన. ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇనుప కంచెల రాజ్యం. చెత్త పాలసీలు కాదు.. రైతుల గురించి చర్చిద్దాం అంటే సభను వాయిదా వేస్తున్నారు.
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
ఎక్కడ చూసినా మార్షల్సే!
అసెంబ్లీలో మునుపెన్నడూ లేనంతగా మార్షల్స్ మంగళవారం కనిపించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో సుమారు 150 మందికి పైగా మార్షల్స్ తిరుగుతుండటంతో ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మార్షల్స్‌ను చూసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఇతర సభ్యులు ఆశ్చర్యపోయారు. ఐదంచెలుగా ఏర్పడి బీఆర్ఎస్, బీ జేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించి అస్తుల కల్పన చేసింది. కాంగ్రెస్ అప్పులు తెచ్చి కొత్తగా ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క పథకం అమలు చేయలేదు. మరి లక్ష కోట్ల అప్పు ఎందుకు? అప్పులు
తెచ్చి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు పంచుకున్నారు.
-హరీశ్‌రావు
కాంగ్రెస్ ఈ రోజుకు వరకు రూ.1,27,367 కోట్ల అప్పు చేసింది. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ ఐదేండ్ల పాలన పూర్తయ్యే సరికి మన నెత్తిన రూ. 6,36,835
కోట్ల అప్పు మిగులుతుంది.
-హరీశ్‌రావు