హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తేతెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు తీర్పు రాకముందే ఇల్లీగల్ అని ఏ విధంగా నిర్ణయిస్తారని సిట్ చీఫ్ సజ్జనార్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఎైంక్వెరీ కొనసాగుతుండగానే సిట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మీరు ఎక్స్ వేదికగా ఇల్లీగల్ అని పేర్కొనడం చూస్తుంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది’ అని చెప్పారు. ‘రాష్ట్ర ప్రతిపక్ష నేతకు కనీస గౌరవం ఇవ్వకపోవడమేనా మీ సంస్కారం?’ అని సోమవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. తీర్పులు చెప్పాల్సింది పోలీసులు కాదని, కోర్టులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుదితీర్పు ఇవ్వకముందే సిట్ చీఫ్ అక్రమమని ప్రకటించడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయ సూత్రమని, దీన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ సజ్జనార్ కనీస న్యాయసూత్రాన్ని పాటించక పోవడం శోచనీయమని వాపోయారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా? అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా? లేదా? అన్న దానిపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. ‘ఈ విషయం సిట్ చీఫ్‌నకు తెలియదా? లేక ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు.
తేలాల్సింది కోర్టులోనే..పోలీసుల ప్రకటనల్లో కాదు..
ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టులో తేలాలి తప్ప, పోలీసుల అధికారిక ప్రకటనల ద్వారా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హరీశ్ చురకలంటించారు. సజ్జనార్ ఎక్స్ వేదికగా వాడిన ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అనే పదాన్ని వాడటం చూస్తుంటే దర్యాప్తు ఫలితంపై ప్రభావం పడే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ అధికారుల నుంచి ఆశించే నిష్పాక్షికతకు, ఆలిండియా సర్వీస్ రూల్స్-1968 ప్రకారం ముమ్మాటికీ తప్పేనని తేల్చిచెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అంశంలో తొందరపాటు చూస్తుంటే ఇది కచ్చితంగా పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అనే విషయం స్పష్టమవుతున్నదని చెప్పారు.
కోర్టు తీర్పు రాకముందే ఇల్లీగల్ అని ఏ విధంగా నిర్ణయిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దశలో ఉండగానే తీర్పు ఎలా ఇస్తారు? రాజ్యాంగం ప్రకారం ఎైంక్వెరీ చేయడమే పోలీసుల పని అని తెలియదా? తీర్పులు చెప్పడానికి మీరేమైనా న్యాయమూర్తులా? ఖాకీ డ్రెస్ వేసుకొని రాజకీయ ఎజెండా అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని తెలియదా?
-హరీశ్‌రావు ప్రశ్న