Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బడుగు, బలహీనవర్గాలకు మద్దతు తెలిపి వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ హెచ్చరించింది. దాడిని మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఖండించారు. దాడికి పాల్పడినవారిని అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే దాడులు చేయడమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్‌గాంధీ చెప్పింది ఇదేనా? ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజాపాలన అంటే? ఇదేనా అని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కేటీఆర్ వెళ్తే ప్రభుత్వానికి భయమెందుకు? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడి ప్రశ్నిం చారు. బీఆర్ఎస్పై జరుగుతున్న వరుస దాడులు కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావాన్ని తెలియజేస్తున్నని చెప్పారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బదులివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని, బరితెగింపులకు పాల్పడుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.