సిద్దిపేట, మే 30 : కాంగ్రెసోళ్లు కరెంటును కూడా ఆగం చేస్తున్నారని, కొత్తగా రైతు డిస్కమ్ పేరుతో రైతు మెడకు ఉరితాడు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతు డిసమ్ అమల్లోకి వస్తే ఉదయం ఏడింటికి ఇచ్చి, సాయంత్రం ఐదింటికి కరెంటు తీసేస్తారని, రాత్రి కరెంటు ఉండనే ఉండదని చెప్పిన ఆయన.. 24గంటల కరెంటుకు ఎసరుపెట్టే ఈ కుట్రను అడ్డుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని భరోసానిచ్చారు. అకడినుంచే ఆర్డీవో, ఇతర అధికారులకు ఫోన్ చేసి కొనుగోల్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. పుల్లూరులో ఇంకా 50 లారీల వడ్లున్నాయని, రైతులు వడ్లు తెచ్చి 50 రోజులు అవుతున్నా కాంటా ఎందుకు చేయడం లేదని ఆర్డీవోను ప్రశ్నించారు. మిల్లర్లు ఒకో రైతు దగ్గర క్వింటాల్‌కు ఐదారు కిలోలు కటింగ్ పెడుతూ గోసపెడుతున్నారని, కటింగ్‌కు ఒప్పుకొంటేనే ధాన్యం దించుకుంటామనడం పద్ధతి కాదని, వెంటనే సమస్యను పరిషరించాలని ఆర్డ్డీవోను ఆదేశించారు.
రైతులను మోసం చేసే కుట్ర
నంగునూరు, మే 30 : రైతు డిస్కమ్‌కు కేవలం సోలార్ పవరే కేటాయిస్తారని హరీశ్‌రావు విమర్శించారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాతే మోటార్లు ఆన్ అయ్యి, సాయంత్రం 5గంటలకు ఎండపోగానే మోటార్లు బంద్ అవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు కేవలం 7నుంచి 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయిలో రైతులను కలిసి వారి ఆవేదనను తెలుసుకున్నారు.
ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రం అగ్రస్థానం
98,112 హెక్టార్లతో ఆయిల్‌పామ్ సాగులో దేశంలో తెలంగాణ ఆగ్రస్థానంలో నిలువడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఈ ఘనత సాధ్యమైందని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.