హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొకిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత తామలా చెప్పలేదంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బోనస్ విషయంలోనూ రైతులను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీనిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మారుస్తున్నదని మండిపడ్డారు. రైతులందరూ బోనస్ కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరమని పేర్కొన్నారు. 90 శాతం రైతులు దొడ్డురకం వడ్లనే పండిస్తారని, పదిశాతం పండే సన్నవడ్లకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు.
ఈ దెబ్బతో తేలిపోయింది
ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే తప్ప, రైతుల పట్ల, వ్యవసాయాభివృద్ధిపట్ల కాంగ్రెస్‌కు ఏమాత్రమూ చిత్తశుద్ధిలేదని మంత్రుల తాజా ప్రకటనతో స్పష్టమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుభరోసా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థికసాయం హామీలను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుమ్మెత్తిపోశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీని వాయిదాలతోనే సరిపెడుతున్నారు తప్పితే అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి చెప్తే అలాంటిదేమీ లేదని బుకాయించారని, ఇప్పుడేమో ఎన్నికలు అయిపోగానే సన్నవడ్లకే బోనస్ అని ప్రకటించడం కాంగ్రెస్ దమననీతికి నిదర్శనమని మండిడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని నిరుద్యోగ యువతీయువకులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.