హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గి సభలో కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్ల దండకంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ములేనపుడు దివాళాకోరు రాజకీయాలు చేసే వ్యక్తులకు మిగిలేది దికుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమేనని విమర్శించారు. పాలనపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిలపడినప్పుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలేనని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రాక్షస భాష, చిల్లర చేష్టలు, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తున్నదని తెలిపారు. అహంకారం తలకెకి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని బుధవారం ఒక ప్రకటనలో హరీశ్‌రావు హెచ్చరించారు.
ఎందుకంత ఉలికిపాటు?: వాసుదేవరెడ్డి
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి, ప్రజలకు వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేస్తేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలుచున్న చోటే భూకంపం వచ్చినట్టయిందని, ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ తన ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ మాటలతో సీఎం రేవంత్ ఎందుకంత ఆత్రుత పడుతున్నాడో తెలియడం లేదని, ఆ తొందరెందుకో? ఉలిక్కిపాటు ఏమిటి అని ప్రశ్నించారు. రోజూ ‘కేసీఆర్ పనై పోయింది’ అంటూ మాట్లాడే రేవంత్‌రెడ్డికి 48 గంటలుగా ప్రశాంతత కరువైనట్టుగానే కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు.
మహానేతపై దూషణలా: విజయ్‌కుమార్
కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి కోస్గీ సభలో చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్‌నేత కురువ విజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణను సాధించిన మహానేతపై వ్యక్తిగత దూషణలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.