హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): క్యూర్, ప్యూర్, రేర్ అంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి కట్టుకథలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. అందాల పోటీల్లా, ఏఐ సమ్మిట్‌లా కోట్లు ఖర్చుచేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్‌ఫ్లాప్ చేశారంటూ బుధవారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని మండిపడ్డారు. వందల మందికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదని, భూములు అమ్ముకొనేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని దెప్పిపొడిచారు. ఫ్యూచర్‌సిటీ వేదికగా రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో పరువు తీసుకున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయో? ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు అని అభివర్ణించారు.
పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే
రేవంత్ ప్రభుత్వం రెండేండ్ల వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు చేసిన పీఆర్ స్టంటే ఈ గ్లోబల్ సమ్మిట్ అని హరీశ్ విమర్శించారు. ‘మూడు నెలల నుంచి ఊదరగొట్టారు. 18 రాష్ర్టాల సీఎంలు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరన్నరు. మంత్రులు పోయి ఒక్కో సీఎంకు ఆహ్వానాలు అందించారు. కనీసం ఒక్క సీఎం, ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు కూడా రాలేదు. చివరికి ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి. వచ్చింది కేవలం ఒక్క మీ పార్ట్నర్ డీకే శివకుమార్ తప్ప’ అంటూ వ్యంగాస్ర్తాలు సంధించారు. గ్లోబల్ సమ్మిట్‌లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారని, చివరికి ఎంబీఏ విద్యార్థులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కోట్లు తొడిగించి తీసుకొచ్చి కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. ‘అది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ సమ్మిట్..అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో’ అని ఎద్దేవాచేశారు.
ఫోర్త్‌సిటీలో రియల్ ఎస్టేట్ కోసమే
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని చెప్పి, అందులో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని సీఎం రేవంత్‌రెడ్డి అందమైన కట్టుకథ అల్లి బయోస్కోపిక్ సినిమా చూపించారని హరీశ్ నిప్పులు చెరిగారు. గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ పక్క భూములు ముందుగానే వారి బినామీలతో కొనిపించి, లేఔట్లు రెడీ చేసి, ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ పేరిట భూములు తెగనమ్మేందుకు స్కెచ్ వేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పెట్టుబడులేవి? వచ్చిన ఉద్యోగాలెన్ని?
రెండేండ్ల పాలనలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చినట్టు.. వేల సంఖ్యలో ఉద్యోగాలు దక్కినట్టు గొప్పలు చెప్పడం తప్ప రేవంత్‌రెడ్డి సాధించిందేమీలేదని హరీశ్ విమర్శించారు. ‘2024 జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి..ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ మీటింగ్ వెళ్లారు. రూ.40,232 కోట్ల పెట్టుబడులు సాధించినం.. 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తయి అని చెప్పిండ్రు. 2024 సెప్టెంబర్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిండ్రు. 100 దేశాల కంపెనీలు పాల్గొన్నయి.. రూ.20వేల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నమని డబ్బా కొట్టిండ్రు.. 2025 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు సూటుబూటు వేసుకొని పోయిండ్రు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెస్తున్నామని పోజులు కొట్టిండ్రు. ఎంతో కష్టపడ్డట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు, ఫొటోలు పెట్టిండ్రు.
16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో రూ.1.78 లక్షల కోట్లకు ఎంవోయూలు కుదిరినయి.. 49,550 ఉద్యోగాలు వస్తయని డబ్బా కొట్టిండ్రు. రెండుసార్లు దావోస్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియాకు పోయిన సీఎం రేవంత్‌రెడ్డి మొత్తంగా సాధించిన పెట్టుబడులెన్ని? వచ్చిన ఉద్యోగాలెన్ని?’ అంటూ నిలదీశారు. రెండు రోజులు జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఏకంగా రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. పెట్టుబడులపై రేవంత్‌రెడ్డివి కట్టుకథలేనని విమర్శించారు. సీఎం చెప్తున్నది నిజమేనని భావిస్తే.. దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. దావోస్ పెట్టుబడులు, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ కంపెనీలు ఎక్కడికిపోయాయని, పెట్టుబడులు ఎవరిజేబుల్లోకి చేరాయో చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలు, సమ్మిట్ల పేరిట ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం చూస్తుంటే అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలే గుర్తుకువస్తున్నాయని చురకలంటించారు.
చెత్త విధానాలతో పక్క రాష్ర్టాలకు కంపెనీలు
కాంగ్రెస్ సర్కారు చెత్త విధానాలతో కంపెనీలన్నీ పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ‘2025-26 బడ్జెట్లో మెగా మాస్టర్ ప్లాన్-2050 అన్నరు. పారిశ్రామిక వికేంద్రీకరణ చేసి తెలంగాణలోని అన్ని ప్రాంతాలను హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చేస్తమన్నరు.. ఇప్పుడు మాత్రం ఫ్యూచరే లేని ఫ్యూచర్‌సిటీలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నరు’ అని ధ్వజమెత్తారు. ‘ఫార్మాసిటీని బొందపెట్టి ఫ్యూచర్‌సిటీని తెరపైకి తేవడంతో సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ లాంటి కంపెనీలు ఆంధ్రాకు తరలిపోయాయి.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ. 2,315 కోట్ల పెట్టుబడులు, 3000 ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు రూపుదిద్దికున్నయి’ అని వివరించారు. ఓపైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే, మరోవైపు హైదరాబాద్ నడిరోడ్లపై జరుగుతున్న మర్డర్లు దిగజారిన శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతున్నదని దుమ్మెత్తిపోశారు.
రేవంత్ బినామీల బాగోతాన్ని బట్టబయలు చేస్తం
గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగాయని హరీశ్‌రావు సంచలన విమర్శలు చేశారు. ఈ అగ్రిమెంట్ల లోగుట్టును త్వరలోనే ఆధారాలతో బట్టబయలు చేస్తామని తేల్చిచెప్పారు. రేవంత్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌ను ఒక ప్రచార స్టంట్‌గా భావించే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ముఖం చాటేశారని దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డీ..మీరు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రికార్డుస్థాయిలో జరిగిన తెలంగాణ అభివృద్ధి గురించి మీ సమక్షంలోనే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ వివరించిండ్రు. తెలంగాణ ఒక మాడల్ అని పొగడ్తలు కురిపించిండ్రు. అదే వేదిక నుంచి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించిండ్రు’ అని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలన, తెలంగాణ అభివృద్ధిపై అవాకులు చెవాకులు పేలే రేవంత్‌రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. లేదంటే తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
అదానీ, అంబానీలకు రేవంత్ ఎర్ర తివాచీ
తెలంగాణ అంటే బిజినెస్ అంటూ దిగజారుడు నిర్వచనాలు ఇచ్చే సీఎం రేవంత్‌రెడ్డికి బిజినెస్ చేయడం తప్ప ప్రజల కన్నీళ్లు, రైతన్నల కష్టాలు కనిపించకపోవడం సిగ్గుచేటని హరీశ్ నిప్పులు చెరిగారు. అదానీ, అంబానీలు దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ చెప్తుంటే ఆయన దగ్గర ఉద్యోగం చేసే రేవంత్‌రెడ్డి మాత్రం అదే అంబానీ, అదానీలకు ఎర్ర తివాచీ పరచడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇందులోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. గతంలో విమర్శలు రావడంతో అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం చెక్కును వాపస్ చేసిన ముఖ్యమంత్రి, గ్లోబల్ సమ్మిట్‌లో అదానీ కొడుకు కరణ్‌తో ఒప్పందాలు ఎలా చేసుకున్నారని నిలదీశారు. ఫ్యూచర్‌సిటీ వేదికగా రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో పరువు తీసుకున్నది. విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదు.
దాన్ని చేరుకునే మిషన్లేదు. ప్రిపరేషన్లో కమిట్మెంట్ లేదు. అక్షరాలు, అంకెలు,రంగు రంగుల పేజీలతో అల్లిన అబద్ధాలు, అర్ధసత్యాలు.. అది
విజన్ డాక్యుమెంట్ కాదు..విజన్‌లెస్ డాక్యుమెంట్. -హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ..రెండేండ్లుగా కోట్లు ఖర్చుచేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినయ్? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయినయ్? ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినయ్? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చెయ్.
-హరీశ్‌రావు
ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, అందులో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని రేవంత్‌రెడ్డి అందమైన కట్టుకథ అల్లి బయోస్కోపిక్ సినిమా చూపించిండు. భూములు, లిక్కర్, పవర్ స్కాంలు అయిపోయినయ్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కామ్ మొదలు పెట్టిండు. గ్లోబల్ సమ్మిట్ ముసుగులో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిండు. -హరీశ్‌రావు
గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగినయ్. ఈ అగ్రిమెంట్ల లోగుట్టును త్వరలోనే ఆధారాలతో బట్టబయలు చేస్తం. ఫార్మాసిటీ పక్క భూములను ముందుగానే వారి బినామీలతో కొనిపించి, లేఔట్లు రెడీ చేసి, ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ పేరిట భూములు తెగనమ్మేందుకు స్కెచ్ వేసిండ్రు.
-హరీశ్‌రావు