హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకు దిగజారుతున్న గురుకుల విద్యా వ్యవస్థను కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా గురుకులాలపై ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తమ సమస్యలను పరిషరించాలంటూ అలంపూర్ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రపై హరీశ్‌రావు స్పందించారు. ‘రాష్ట్రంలో త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పాదయాత్ర చేయడం కాదు, గురుకులాల విద్యార్థులు రోడ్కెక్కి చేస్తున్న పాదయాత్రపై దృష్టి సారించాలి’ అని ప్రభుత్వానికి హితవు పలికారు.
రేవంత్‌రెడ్డీ.. ఏం సమాధానం చెబుతవ్?
‘ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. తమ సమస్యలను పరిషరించాలంటూ.. పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావ్?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. పరిపాలనను గాలికి వదిలి, అనునిత్యం రాజకీయాలు చేసే సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయమని మండిపడ్డారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులను, నడిరోడ్డు ఎకించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. చదువుకోవాల్సిన విద్యార్థులకు పట్టెడు అన్నం కోసం, తాగునీటి కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించడం అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శమని విమర్శించారు. అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి, అక్కడి జిల్లా కలెక్టర్‌కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు స్పందించి, తక్షణం వారి సమస్యలకు పరిషారం చూపించాలని డిమాండ్ చేశారు.