హైదరాబాద్, జనవరి 17 (నమస్తేతెలంగాణ): ప్రజల మేలు, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా కుటిలయత్నం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి మార్గనిర్దేశనం చేశారు.
రేవంత్ సర్కారు కపట నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాల రద్దు దిశగా అడుగులేస్తున్న రేవంత్ సర్కారుపై సమరానికి సన్నద్ధంకావాలని నిర్దేశించారు. వెంటనే ఈ దిశగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యం, కృష్ణా జలాల్లో వాటా సాధనలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపి, ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.
పాలమూరు అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే..
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరును అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. పాలనా వికేంద్రీకరణ దృక్పథంతోనే పాలమూరులో నాడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డను అని పదే పదే చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల రద్దు కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు విడమరిచి చెప్పాలని శ్రేణులకు సూచించారు. జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ మహబూబ్‌నగర్ పట్టణంపై దృష్టిపెట్టాలని కోరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలు, ఆరు గ్యారెంటీ లు, 420 హామీల అమలులో విఫలమైన తీరును ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పాలనలోనే నల్లగొండకు మహర్దశ
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే నల్లగొండకు మహర్దశ పట్టిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో దుర్భిక్షంలో చిక్కుకున్న జిల్లాను అన్ని రంగాల్లో ముందునిలిపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. ఇద్దరు మంత్రులు ఉన్న నల్లగొండ జిల్లాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ సర్కారు చేసిందేమీలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, నిలిపివేసిన సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. గతంలో టీయూఎఫ్ఐడీసీ, పురపాలక శాఖ ఆధ్వర్యంలో వందల కోట్లతో చేపట్టిన ప్రగతి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మున్సిపాలిటీల వారీగా కార్యాచరణ..
త్వరలోనే బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీల వారీగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల శ్రేణులకు సూచించారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి మున్సిపాల్టీలను గెలుచుకోవాలని సూచించారు. కాగా, ఈ సమా వేశంలో పార్టీ నాయకులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పరిస్థితులు, సంసిద్ధత, చేపడుతున్న కార్యక్రమాలను కేటీఆర్‌కు వివరించారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం అంశాల వారీగా శ్రేణులకు వివరించారు. వ్యూహరచన, ముందుకెళ్లాల్సిన తీరుపై సూచనలు, సలహాలు ఇచ్చారు.