హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో కొనుగోలు చేసిన ధాన్యంలో 50 శాతం స్టాక్ మిల్లర్ల వద్ద మిస్సయినట్టు విచారణలో తేలిందని ఉత్తమ్ ఆరోపించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. “రుణమాఫీ అనేది దేశంలోనే ఒక రికార్డు. 80-90శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. ఎల్పీజీ కనెక్షన్ ఉండి, తెలుపు రేషన్‌కార్డు ఉన్న అందరికీ రూ. 500కు సిలిండర్ ఇవ్వడానికి కట్టుబడిఉన్నాం. వినియోగదారులు రూ. 500 చెల్లించి సిలిండర్ తీసుకునేలా ఆయిల్ కంపెనీలకు అడ్వాన్స్‌గా చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..
కొత్త రేషన్‌కార్డుల జారీపై ఎల్లుండి క్యాబినెట్లో విధివిధానాలు ఫైనలైజ్ చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అర్హత ఉన్నవారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. అతి త్వరలో రేషన్‌లో సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నట్టు చెప్పారు. దొడ్డు బియ్యం 50 శాతం మిస్యూజ్ అవుతున్నాయని తెలిపారు. అందుకనే రేషన్ ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 91,68,231 కార్డులు ఉండగా, నేడు 89,96,000కార్డులు మాత్రమే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. గత పదేండ్లలో ఎక్కడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. క్యాబినెట్ సబ్‌కమిటీలో విధివిధానాలు, ఇన్కమ్ లిమిట్, ల్యాండ్ హోల్డింగ్ తదితర అంశాలను ఫైనలైజ్ చేస్తామని వివరించారు. ధాన్యం వేలంలో తెలంగాణ వారే పాల్గొనాలన్న నిబంధనలు పెట్టామని గుర్తుచేశారు. సన్నబియ్యం వడ్లు 1.6 లక్షల టన్నులు ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు చెప్పారని, కానీ కేవలం 40వేల టన్నులు మాత్రమే ఉన్నాయని వివరించారు. తాము నిర్వహించిన వేలంలో రూ.1100 ధర ఎక్కువ వచ్చినట్టు తెలిపారు.
రేషన్‌కార్డులపై మంత్రి వ్యాఖ్యలకు గంగుల సమాధానమిస్తూ తెలంగాణ ఏర్పడేనాటికి 91లక్షల రేషన్ కార్డులు ఉన్నాయనడం సరికాదన్నారు. తాము ప్రతి ఏటా కార్డులు ఇచ్చుకుంటూ 91లక్షల కార్డులకు పెంచామని వివరించారు. తాను చెప్పింది తప్పయితే సభనుంచి వెళ్లిపోతానని గంగుల సవాల్ విసిరారు. ఉత్తమ్ మాట్లాడుతూ సన్నబియ్యం, సన్నవడ్లు మార్కెట్ రేటు చాలా ఎక్కువని కాబట్టి రైతులు, రైస్ మిల్లర్లు ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు రాకుండా బయట అమ్ముకున్నారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. 35లక్షల టన్నుల ధాన్యానికి ఆక్షన్ పెడితే కాంట్రాక్టర్లు ఎవరు వచ్చారో బయటపెట్టాలని గంగుల డిమాండ్ చేశారు.