హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అహ్మద్ ఫరీదుద్దీన్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వారం క్రితమే గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్లో కాలేయ శస్త్రచికిత్స జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఫరీదుద్దీన్కు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతి(బీ) గ్రామంలో 14 అక్టోబర్ 1957లో ఫరీదుద్దీన్ జన్మించారు. ఆయనకు భార్య ఫాతిమున్నీసాబేగం, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలిచి, 2009 వరకు వైఎస్సార్ ప్రభుత్వంలో రాష్ట్ర మైనారిటీశాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఆగస్టులో టీఆర్ఎస్లో చేరి 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ అంత్యక్రియలు గురువారం హోతి(బీ) గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
మృతిపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి
ఫరీదుద్దీన్ ఆకస్మిక మృతిపై సీఎం కేసీఆర్ , మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ సేవలను కొనియాడారు.