పాలకుర్తి రూరల్/వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 19: కాంగ్రెస్ నేత ప్రోద్భలం.. పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఓ గిరిజన యువకుడు.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహంచిన మృతుడి కుటుంబ సభ్యులు, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం శివారు మేకల తండాకు చెందిన లకావత్ శ్రీను (22)కు ఇదే మండలంలోని గూడూరు శివారు నర్సింగపురం తండాకు చెందిన సరోజతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గర్భవతిగా ఉన్న సరోజ ఈ నెల 16న జనగామలోని చంపక్ హిల్స్‌లోని దవాఖానకు వైద్య పరీక్షలకు వెళ్లింది.
శ్రీను అక్కడ గొడవపడి భార్యను కొట్టడంతో సరోజ పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విచారణ కోసం పిలవగా శ్రీను స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ సరోజ, ఆమె బంధువులు కొట్టగా మనస్తాపం చెందిన శ్రీను శుక్రవారం పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనును వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 6 గంటలకు మృతి చెందాడు.
ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు పాలకుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని, ఎస్సై, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్.. ఫోన్లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో మాట్లాడించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందేలా కృషి చేస్తానని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఎంజీఎం మార్చురీలో లకావత్ శ్రీను మృతదేహానికి మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. లకావత్ శ్రీను కుటుంబసభ్యులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.15 వేల ఆర్థికసాయాన్ని అందించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.