జనగామ టౌన్, జూలై 9 : విశ్రాంత ఉపాధ్యాయుడిది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య భార్య అనిత, కుమారుడు భార్గవ్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులను గురువారం టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాదరావు, కారం రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా 35 ఏండ్లు పనిచేసిన మల్లయ్య తన సర్వీసులో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరుగడం లేదన్న ఆవేదనతో, తనలాగా ఉద్యోగ విరమణ పొందిన వారెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, తన చావే చివరిది కావాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. మల్లయ్య హైకోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం డబ్బులు చెల్లించి ఉంటే అతడు బతికి ఉండేవారని తెలిపారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనేనని మండిపడ్డారు. డబ్బులు లేక దవాఖానల్లో అడ్మిట్ కాలేక చనిపోయిన విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని, అలాగే అడ్మిట్ అయిన తర్వాత చనిపోయి బిల్లులు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోయారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఏం మాట్లాడినా ప్రభుత్వం ‘అప్పులు, అప్పులు’ అనే మాటలు తప్ప, కాంట్రాక్టర్లకు ఇచ్చే పైసలు ఒకరోజు ఆపితే విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సర్దుబాటు అయిపోతాయని సూచించారు.
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన 26 వేల మంది ఉద్యోగులందరి పరిస్థితి ఇదే విధంగా ఉన్నదని వాపోయారు. మల్లయ్య కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ అందక ఇప్పటి వరకు మల్లయ్యతో కలిపి 100 మంది విశ్రాంత ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడితో చనిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒకే విడతలో విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు, పెన్షనర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు యాదవరెడ్డి, శంకరయ్య, హరిబాబు, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, మాజీ జడ్పీటీసీ బాల్దె సిద్ధిలింగం, కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, జూకంటి శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు రావెల రవి, బోళ్ల సంపత్, కొమ్ము రాజు, ఇరుగు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.