హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఇతర అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, దీనికోసం బుధవారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వంద రోజులు పూర్తయినా ఉద్యోగుల హెల్త్ పాలసీ హామీ అమలుపై ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్‌కార్డ్‌లు జారీచేసి కార్పొరేట్ వైద్యం అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ బిల్లులు రావడం లేదని, హౌస్‌బిల్డింగ్ అడ్వాన్స్‌లు విడుదల చేయడం లేదని, వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు మంత్రుల జిల్లాలోని ఉద్యోగులకే బిల్లులు చెల్లిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అందరికీ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్‌లు, ఎరియర్స్ వంటివి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగు వేతనాలను విడుదల చేయాలని కోరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు.
కొందరు కలెక్టర్లు, హెచ్వోడీలు కిందిస్థాయి ఉద్యోగులతో అమర్యాదగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని, అధికారులు తమ పద్ధతి మార్చుకోకుంటే ఊరుకునేది లేదని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. జాబ్‌చార్ట్ ప్రకారం ఎవరిపని వారు చేయాలని, ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో కొందరు ఉద్యోగులపై అకారణంగా చర్యలు తీసుకుంటున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. విధులనుంచి తొలగించిన 250 మంది హోంగార్డ్‌లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వారితోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పర్మినెంటు చేయాలని కోరారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని, స్పౌజ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని కోరారు.