మెదక్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుపై వెంటనే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆదివారం ఆమె ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏండ్లు పోరాడి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ పట్ల ఈనెల 17న అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చకపోగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలతో ఓట్లు వేయించుకొని అభివృద్ధి చేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి ఎదుటివారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇలాంటి కుట్రలు చెల్లవని అన్నారు. దమ్ముంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.