హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎంకు, ఓ మంత్రికి మధ్య చెలరేగిన టెండర్ల వివాదంలో నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి రిజ్వీని బలిపశువును చేశారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య మైనార్టీలకే కాదు.. ఆ వర్గ ఐఏఎస్‌లకూ ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రెం డేండ్లుగా మైనార్టీలపై సర్కారు జులుం చెలాయిస్తున్నదని ఆక్షేపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా, ముకుసూటిగా పనిచేసే రిజ్వీకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని తెలిపారు. ముస్లింలలో ఐఏఎస్ అధికారులే తకువ అని.. అలాంటివారిలో ఒకరైన రిజ్వీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అవమానించడాన్ని ముస్లిం మైనార్టీలు సహించలేకపోతున్నారని తెలిపారు. సా మాన్య ముస్లింల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాయితీ గల అధికారులకు స్థానం లేదా? అని నిలదీశారు. రిజ్వీపై రేవంత్ సర్కారు తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
మైనార్టీలపై రేవంత్ నిర్లక్ష్యం
రాష్ట్రంలో మైనార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మహమూద్ అలీ విమర్శించారు. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ ఒక హామీని ఆయన అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రేవంత్ క్యాబినెట్లో ఒక ముస్లింకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతకలహాలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. మైనార్టీలు సహా అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనను చీదరించుకుంటున్నాయని, జూబ్లీహిల్స్‌తోపాటు వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బీజేపీ ఎజెండాను ఫాలో అవుతున్న రేవంత్ : ముజీబ్
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బీజేపీ ఎజెండాను ఫాలో అవుతున్నారని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంకే ముజీబ్ విమర్శించారు. 75 ఏండ్లలో ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి లేకుండా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నదని మండిపడ్డారు. సీఎం అల్లుడు, మంత్రి కొడుకు టెండర్ల గొడవ కోసం ఐఏఎస్ అధికారి రిజ్వీ తన ఉద్యో గం నుంచి వైదొలగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో ఒకపని జరగడం లేదని, ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని విమర్శించారు. నాలుగు స్తంభాల ఆటలో ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు.