సుబేదారి, జనవరి 21/మన్సూరాబాద్ : హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చా ర్జి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఇటీవ ల ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏ వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. బుధవా రం ఏసీబీ అధికారుల సోదాల్లో వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల చిట్టా బయటపడింది. పెద్ద మొత్తంలో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు బట్టబయలయ్యాయి. గత నెల 5న హనుమకొండ కలెక్టరేట్లో ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం ఆ స్కూల్ డైరెక్టర్ నుంచి జిల్లా విద్యాశాఖ కా ర్యాలయ సిబ్బంది ద్వారా వెంకట్‌రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకొని రిమాండ్‌కు తరలించింది. వెంకట్‌రెడ్డి సహా డీఈవో ఆఫీస్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. దీంతో ఆ ముగ్గురినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకట్‌రెడ్డి వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. మిర్యాలగూడ, హైదారాబాద్, నల్లగొండ, రంగారెడ్డి ప్రాంతాల్లోని 8 చోట్ల వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధువుల నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సుబ్బయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. విలులైన డాక్యుమెంట్లు, బంగారం, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు 8 చోట్ల చేపట్టిన తనిఖీల్లో వెంకట్‌రెడ్డి అక్రమాస్తులను భారీగా గుర్తించారు. హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో వెంకట్‌రెడ్డి విల్లా, బంధువులు, స్నేహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల పేరున విల్లా, మరో ఇల్లు ఉండగా, వీటి విలువ రూ.4.65 కోట్లు గా నిర్ధారించారు. ఒక కమర్షియల్ షాప్ విలువ రూ.60 లక్షలు కాగా, ఎల్బీ నగర్ రాక్‌టౌన్ కాలనీలో ఫ్లాట్, నల్లగొండలో 8 ఓపెన్ ప్లాట్ల విలువ రూ.65 లక్షలుగా ఉన్నాయి. 14.25 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.50 లక్షలు. రూ.30 లక్షల నగదు, ఖాతా ల్లో నిల్వ ఉన్న రూ.44,003,32 నగదును సీజ్ చేశారు, గృహోపకరణాలు రూ.11 లక్ష లు, 3 కార్ల విలువ రూ.40 లక్షలు, 297 గ్రా ముల బంగారం విలువ రూ.4.35 లక్షలు ఉ న్నట్టు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ.7,69,38,332గా తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ మార్కెట్లో రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు.
వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నదని ఏసీబీ అధికారులు తెలిపారు. హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవోగా పనిచేసిన వెంకట్‌రెడ్డి అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించాడని సోదాలతో వెలుగులోకి రావడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రెవె న్యూ, సివిల్ సైప్లె, మిల్లర్లు, మైనింగ్, విద్యాశాఖతోపాటు ఆదాయం వచ్చే శాఖలపై కన్నేసిన వెంకట్‌రెడ్డి పక్కాగా డబ్బులు తీసుకొనే ఫైళ్లపై సంతకం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. నమ్మకస్తులైన అధికారులు, సిబ్బంది ద్వారా డబ్బులు తీసుకొనేవాడనే గుసగుసలు. వెంకట్‌రెడ్డిపై 2008లో అక్రమాస్తుల కేసు, 2016, 2017లో నేషనల్ హైవే ఎక్స్‌ప్రెస్ స్కీమ్‌లో రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో మోసాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.