హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మూడు గంటల విద్యుత్తు వ్యవసాయానికి ఎందుకూ పనికిరాదని, రైతులు ఏ పంటను కూడా పండించలేరని ఉద్యానశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయరంగానికి కనీసం 18 గంటల కరెంట్ అవసరమని, 24 గంటలు ఇస్తుండటం మరీ మంచిదని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్.. అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసలు ఏ పంటకు ఎంత నీరు కావాలి? దానికి ఎంత సమయం పడుతుంది? ఒకవేళ మూడు గంటల విద్యుత్తు ఇస్తే పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై వెంకట్రామిరెడ్డి తన అభిప్రాయాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
ఎకరానికి కనీసం 5 గంటల కరెంట్ కావాలే..
పంటను బట్టి నీళ్లు అవసరం అవుతాయి. ఎకరం వరి పంటకు రోజుకు కనీసం 50 వేల నుంచి 60 వేల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఎకరం పొలం పారడానికి బోరు కనీసం ఐదు గంటలు నడవాల్సి ఉంటుంది. ఎకరం ఉద్యాన పంటలకు 20-25 వేల లీటర్లు, ఆయిల్‌పామ్‌కు 15 వేల లీటర్ల నీళ్లు కావాలి. ఉద్యాన పంటలకు మూడు గంటలు, ఆయిల్‌పామ్‌కు ఒకట్నిర గంటలు మోటారు నడవాలి. సమృద్ధిగా నీళ్లున్న ప్రాంతంలో 5 హెచ్‌పీ మోటారు బోరు గంటకు 10 వేల లీటర్ల నీటిని తోడిపోస్తుంది. వరి, చెరుకు వంటి పంటల సాగుకు 18 గంటలు, ఆయిల్‌పామ్ సాగుకు 7 గంటల కరెంట్ కావాలి.
24 గంటల కరెంట్ లేకుండా ఎవుసాన్ని ఊహించలేం
గతంతో పోల్చితే రాష్ట్రంలో నీళ్ల వసతి పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా భారీ పెరిగింది. ఇది ఇలాగే కొనసాగాలంటే నీళ్లతోపాటు సమృద్ధిగా విద్యుత్తు సరఫరా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 24 గంటల ఉచిత విద్యుత్తు లేకుండా వ్యవసాయాన్ని ఊహించుకోలేం. ఇందుకు కారణం మన వద్ద 60 శాతం వ్యవసాయం బావులు, బోర్లపై ఆధారపడింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి కనీసం 18 గంటల విద్యుత్తు అవసరం. 24 గంటలు ఇస్తుండటం మరీ మంచిది.
మూడు గంటలతో ఎడారే
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు నెలకొంటాయి. ఆ విద్యుత్తుతో రైతులు ఏ పంటనూ పండించలేరు. ఇదే జరిగితే రైతులు ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. సాగుకు మూడు గంటల విద్యుత్తు చాలనడమంటే రాష్ర్టాన్ని ఎడారిగా మార్చడమే అవుతుంది. ఒక్క వ్యవసాయ రంగం కుంటుపడితే ఆ ప్రభావం మిగిలిన అన్ని రంగాలపై పడుతుంది. ప్రజలకు ఉపాధి కరువైతది. ఆ పరిస్థితులు తెలంగాణలో రావొద్దు.
24 గంటల ఉచిత విద్యుత్తు గొప్ప ఆలోచన
వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు కూడా కరెంట్ ముఖ్యమైన అంశం. సాగుకు చాలా ప్రధానమైనది. వ్యవసాయరంగం బాగుంటేనే మిగిలిన రంగాలు బాగుంటాయి. అందుకే సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా ఆలోచించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అమలు చేశారు. ఇది చాలా గొప్ప నిర్ణయం. కానీ, కొందరు దీనివల్ల జరుగుతున్న మేలును పక్కనపెట్టి ఉల్టా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర వ్యవసాయరంగానికి ఏ మాత్రం మంచిది కాదు. రైతుల జీవితాలకు ఇది శాపంగా మారుతుంది. ఎవరు ఏమన్నా ఎవుసానికి 24 గంటల విద్యుత్తు ఇవ్వాల్సిందే.