హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ : సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిని వీడాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హితవు పలికారు. మాదిగలకు అనుకూలంగా ఉన్నట్టుగా బయటకు నటిస్తూనే, వెనుక నుంచి మాలలను ఎగదోస్తున్నారని విమర్శించారు. మాయలమరాఠీ మాటలను ఇకనైనా బంద్ చేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ అయ్యాకే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని, అప్పటివరకు గ్రూప్స్ ఫలితాలను ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీలను మోసం చేయాలనే ఉద్దేశంతో ఆదరాబాదరాగా గ్రూప్స్ ఉద్యోగాలను నింపాలని చూస్తున్నారని, ఈ నెల 11న గ్రూప్-1 ఫలితాలను ప్రకటించనున్నట్టు కమిషన్ తెలిపిందని తెలిపారు. ఎస్సీ సబ్ క్యాటగిరీ విషయంలోనూ రేవంత్‌రెడ్డి మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ నివేదిక తప్పుల తడకగా ఉన్నదని, దీనిపై మాదిగ, ఉపకులాలకు అభ్యంతరాలున్నాయని గుర్తుచేశారు. ఆర్థికంగా ఎదిగిన కులాలను గ్రూప్-ఏలో పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఒక మాదిగ కులస్తులే 33.33 లక్షల మంది ఉన్నారని తెలిపారు. 15 లక్షల మంది ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, ఆ లెక్కన మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని డిమాండ్ చేశారు. బుడగజంగాలను మాదిగల నుంచి వేరుచేశారని విమర్శించారు. వెనుకబడిన నేతకాని కులాన్ని గ్రూప్ సీలో చేర్చి మాలలతో కలిపి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని అన్నారు.