మలక్‌పేట, మార్చి 7: మూసారాంబాగ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి కుమారుడు కనిష్క్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో (19) మృతి చెందారు. టెక్ మహీంద్రా కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కనిష్క్‌రెడ్డి గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని స్నేహితుని ఇంట్లో ఓ వేడుకకు హాజరై తన బెంజ్ కారులో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన కారు పెద్ద గోల్కొండ-తుక్కుగూడ మధ్యన ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుకవైపు నుంచి ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కనిష్క్రెడ్డిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కనిష్క్‌రెడ్డి తండ్రి తీగల అజిత్‌రెడ్డి, తల్లి సునరితారెడ్డి మెరుగైన చికిత్స కోసం కనిష్క్రెడ్డిని మలక్‌పేటలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనిష్క్‌రెడ్డి కన్నుమూశారు.