హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుకు చెర్క మహేశ్ శనివారం లేఖ రాశారు. ఈ పరిణామంతో ఇప్పటికే అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిన సేవలకు గాను.. కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా ఉండటమే తన బాధ్యత అని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని లేఖలో విమర్శించారు. బీజేపీ వైఖరితో రైతులు, యువకులు, మహిళలు, కుల వృత్తుల కార్మికులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నాయని, కానీ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక చెర్క మహేశ్ బీజేపీకి రాజీనామా చేయడం, బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా ఉంటానని స్పష్టం చేయడంతో గులాబీ పార్టీకి బలం చేకూరినట్టయ్యింది. అదే సమయంలో అభ్యర్థిని ప్రకటించడానికి ముందే బీజేపీకి కీలక నేత రాజీనామా చేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.