Cheyutha | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల ఆర్థిక స్వాలంబన కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పరితపించారు. వారి కోసం ‘చేనేతకు చే యూత’ పేరుతో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నీరుగార్చింది. స్కీమ్‌ను నిలిపివేసి నేతన్నల కడుపుకొట్టింది. వారిని ఆర్థిక సమస్యల ఊబిలో పడేసింది. ఫలితంగా మ ళ్లీ నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
గత 36 నెలలుగా దిగ్విజయంగా కొనసాగిన చేయూత పథకం గడువు ముగిసినా.. ఇంత వరకు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించలేదు. అదేమని అడిగిన నేత కార్మిక సంఘాల నాయకులకు చేదు అనుభవమే మిగిలింది. తప్పని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కత్తి కడుతోంది. కనీసం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న డిమాండ్‌కు ప్రభుత్వంలో చలనం కూడా లేకుండా పోయిందనే అభిప్రాయాలను నేత కార్మికులు వ్యక్తంచేస్తున్నారు. చేయూత పథకాన్ని కొనసాగించాలని, తమ బతుకులను బాగుచేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసినా.. ఫలితం లేదని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు కూరపాటి రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
వాస్తవానికి ‘చేనేత చేయూత’ పథకం అద్భుతమైంది. ఓ నేత కార్మికుడు ప్రతి నెలా బ్యాంకులో రూ.1000 జమ చేస్తే.. దానికి ప్రభుత్వం రూ.2000 కలిపి మొత్తాన్ని తిరిగి నేత కార్మికుడి ఖాతాలో జమ చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంతో ఆర్థికంగా చితికపోయిన నేతన్నలకు ఆర్థిక పరిపుష్టి లభించింది. వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వారి బతుకులను ఆగం చేసింది. చేయూత పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకం కింద నేత కార్మికులు గత 36 నెలలపాటు రూ.1000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లను కేటాయించి తిరిగి రెన్యువల్ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తకపోవడం గమనార్హం.