హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తొమ్మిది నెలల్లోనే తొమ్మిది మత ఘర్షణలు జరగడం రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ ఇంతియాజ్ ఇషాక్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు చేసిందేమీలేదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని, షాదీముబారక్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికి, ఒక్క ఆడబిడ్డ పెండ్లికి కూడా తులం బంగారం ఇవ్వలేదని ఆక్షేపించారు. మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనాలివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో ఏర్పాటు చేసిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను గాలికొదిలేసిందని విమర్శించారు. జైనూర్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. లైంగికదాడి నిందితులను, దుకాణాలను ధ్వంసం చేసినవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోలుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. పత్తి చేతికొచ్చేలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, జిన్నింగ్ మిల్లులను సిద్ధం చేయాలని సూచించారు. పత్తి ధర, నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.