ఖమ్మం, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ మే 27 (నమస్తేతెలంగాణ): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్ గుండెపోటుతో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తొలుత ఖమ్మంలోని దవాఖానలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీకి తరలించారు. చికిత్స పొందుతుండగానే సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మరణించారు. ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్‌లాల్ మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతగానో కలిచివేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మదన్‌లాల్ మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. శోకతప్తులైన వారి కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మదన్‌లాల్ ప్రస్థానం..
మదన్‌లాల్ ఈర్లపూడి ఎంపీటీసీగా, సర్పంచ్‌గా పలు పర్యాయాలు పనిచేశారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున వైరా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఆ తరువాత 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మదన్‌లాల్ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్నారు. మదన్‌లాల్ కుమారుడు మృగేందర్‌లాల్ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కోడలు సైతం తమిళనాడు క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. మదన్‌లాల్ ఆకస్మిక మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామం ఈర్లపూడి శోకసంద్రమైంది. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరంలోని అతడి నివాసానికి తీసుకురాగా అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.
నిబద్ధత కలిగిన నేతను కోల్పోయాం: కేటీఆర్
మదన్‌లాల్ అకాల మరణం కలిచివేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. పార్టీ నిబద్ధత, నిజాయతీ కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతగానో పరితపించారని కొనియాడారు. బీఆర్ఎస్ అభివృద్ధికి మదన్‌లాల్ సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి గిరిజన, బలహీనవర్గాలకు తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.
పలువురి నివాళి
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని మదన్‌లాల్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మదన్‌లాల్ కుమారుడు మృగేందర్‌లాల్‌ను ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మదన్‌లాల్ ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, రాములునాయక్, మె చ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.
ప్రముఖుల సంతాపం
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతి పట్ల మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి తదితరులు సంతాపం ప్రకటించారు. మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరారు.
మదన్‌లాల్ కుమారుడికి కేసీఆర్ ఫోన్
ఖమ్మం, మే 27: మదన్‌లాల్ మృతికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని మదన్‌లాల్ ఇంటి వద్ద నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. కేసీఆర్‌కు ఫోన్ చేసి మదన్‌లాల్ కుమారుడు మృగేందర్‌లాల్‌తో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మృగేందర్‌లాల్‌తో మాట్లాడుతూ ‘మీ తండ్రి మదన్‌లాల్ నాకు సన్నిహితుడు, నిబద్ధత కలిగిన మంచి నాయకుడు. ఆయన అకాల మరణం తీవ్ర బాధాకరం’ అని అన్నారు. మదన్‌లాల్ ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పారు. తల్లి మంజుల, సోదరి మనీషా లక్ష్మీని ఓదార్చారు. ‘మీ కుటుంబానికి నాతోపాటు పార్టీ నేతలు అండగా ఉంటారు’ అని భరోసానిచ్చారు.