హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు కూడా అమిత్‌షాకు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. రేవంత్ తమవాడేనని, ఎప్పుడంటే అప్పుడు పార్టీ జంప్ చేయటానికి సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చినట్టు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేశ్‌కుమార్, గట్టు రాంచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ చెట్టాపట్టాల్పై తెలంగాణ సమాజం చర్చించుకుంటున్నదని, ఆయన మరో ఏక్‌నాథ్‌షిండే, హిమంత బిశ్వ శర్మ అవుతారని సుమన్ విమర్శించారు.
రేవంత్ తన గురువు చంద్రబాబుతో బేగంపేట ఎయిర్‌పోర్టులో రెండు గంటల పాటు చర్చలు జరిపారని వెల్లడించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీవైపు తీసుకొస్తానని అమిత్‌షాకు బాబు హామీ ఇచ్చారని వివరించారు. చంద్రబాబు టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా కాంగ్రెస్‌కు సహకరించిందని, పొంగులేటి, తుమ్మల టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పారని గుర్తుచేశారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోదించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, అందుకు నిదర్శనంగానే కిందిస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని వెల్లడించారు. ఆ రెండు పార్టీలు కలిసి భువనగిరి, నల్లగొండ, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో అధికారాన్ని పంచుకున్నాయని తెలిపారు. జగిత్యాలలో రెబల్ అభ్యర్థికి బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. మంచిర్యాల, ఖానాపూర్, నస్పూర్ మున్సిపాలిటీల్లో చేతిలో పువ్వు పట్టుకొని సీట్లను కైవసం చేసుకున్నారని విమర్శించారు.
రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ఇప్పటికే అదృశ్యమయ్యిందని చెప్పారు. మొదట్లో భట్టి ఫొటో వేశారని, ఆ తర్వాత ఆయన ఫొటో, ఇందిరమ్మ ఫొటో కూడా తీసివేశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఫొటోలు ఉంటారని ఎద్దేవా చేశారు
చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ కరువు వచ్చిందని సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ పరిస్థితి దాచిదాచి దయ్యాల పాలు అయినట్టుగా మారిందని విమర్శించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత అని, గతంలో తన గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ రైఫిల్ ఎకుపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతిలో రేవంత్ పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలని సూచించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ చేస్తున్న ప్రకటనలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవేనని అన్నారు. తెలంగాణ ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త! అని పేర్కొన్నారు.