బీబీనగర్/హైదరాబాద్, జూలై 7 (నమ స్తే తెలంగాణ): భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రామచంద్రారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు నాలుగో సంతానం కొమ్మిడి నర్సింహారెడ్డ్డి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులు కూడబెట్టకుండా, పాత సూటర్ మినహా సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కొ మ్మిడి నర్సింహారెడ్డి మరణంపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని, ఒక గొప్ప ప్రజానేతను కోల్పోయామని తెలిపారు.
రాజకీయాల్లో నిరాడంబరత, నిజాయితీకి కొమ్మిడి నర్సింహారెడ్డి నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. ప్రజల మనిషిగా ఆ యన కీర్తి ప్రతిష్టలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు. భూదానోద్యమ స్ఫూర్తితో తన సొంత ఆస్తిలోని వందలాది ఎకరాలను పేదలకు దానం చేసిన గొప్ప మనసు ఆయనదని కేసీఆర్ స్మరించుకున్నారు. తొలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో (1969) నర్సింహారెడ్డి చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించారని, ముఖ్యంగా మూసీ నది పరిరక్షణ, తెలంగాణకు గోదావరి జలాలు రావాలనే ఆకాంక్షతో ఆయన చేసిన పోరాటాలు, కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.