భద్రాచలం, అక్టోబర్ 16: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (50) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో తీవ్రమైన ఛాతినొప్పితో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. 2009లో వైఎస్సార్ టికెట్ ఇవ్వడంతో సీపీఎంకు రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. వైఎస్సార్ మరణంతో వైఎస్సార్సీపీలో చేరారు.
అనంతరం బీజేపీలో చేరి 2018లో భద్రాచలం నుంచి పోటీచేసి ఓడిపోయారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పలువురు నాయకులు సోమవారం భద్రాచలంలోని కుంజా సత్యవతి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.