హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన నివేదికను వెంటనే బయటపెట్టాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖను రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని న్యాయపరంగా బలోపేతం చేయకపోతే.. భవిష్యత్తులో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు.
42% రిజర్వేషన్ల అమలుకు బలమైన ఆధారాలు అవసరమని.. శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంటుందని.. అవేవీలేకుండా బిల్లులను ప్రవేశపెడితే భవిష్యత్తులో వివాదాలు తలెత్తుతాయని సూచించారు. కులగణనపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిటీ నివేదికను వెల్లడించిన అనంతరమే బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే డెడికేటెడ్ కమిషన్ నివేదికలోని లోపాలను సవరించాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టి బీసీలపై చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్‌చేశారు.