Vakulabharanam Krishna Mohan Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ‘ఇంటింటి సర్వేను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అశాస్త్రీయంగా నిర్వహించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఇష్టారీతిన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తూ, ఒకసారి బీసీ కమిషన్, మరోసారి డెడికేటెడ్ కమిషన్ అంటూ గందరగోళం సృష్టించింది. నిపుణుల కమిటీని, కులగణనకు నోడల్ అధికారిని నియమించకుండా, అసంబద్ధమైన ప్రశ్నలతో ప్రజల్లో అపోహలను రేకేత్తించింది. అసమగ్రంగానే వివరాలను సేకరించింది. వెరసి నివేదికకు ఏ ప్రామాణికత లేకుండా పోయింది. ఆ నివేదిక ఆధారంగా స్థిరీకరించే రిజర్వేషన్లు సైతం చట్టం ముందు నిలబడే పరిస్థితిలేదు. అగ్రవర్ణాలకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఈ సర్వేను నామమాత్రంగా నిర్వహించింది’ అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ధ్వజమెత్తారు. ఇంటింటి సర్వే నివేదికకు ఎలాంటి సాధికారత లేదని తేల్చిచెప్పారు. ఆయా అంశాలపై ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
వాస్తవంగా జనాభా గణన, సర్వే రెండూ వేర్వేరు. జనాభా గణన అంటే మొత్తం ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించడం. సర్వే అనేది నిర్దేశిత లక్ష్యాలతో ఏదైనా ఒక అంశానికి సంబంధించింది. జనాభా గణన అంశం అనేది 7వ షెడ్యూల్లో కేంద్రం జాబితాలోని అంశం. జనాభా గణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉన్నది. సర్వేలను రాష్ట్ర ప్రభుత్వాలు నియమిత పరిమితులకు లోబడి నిర్వహించుకోవచ్చు. గణాంకాల సేకరణ చట్టం 2008 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డాటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాలను బదలాయించింది. ఆ గణాంకాల సేకరణకు నిబంధనలు సూచించింది. ఉదాహరణకు ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసి, నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయాల నుంచి నవీకరించిన ఎన్యుమరేషన్ బ్లాక్‌ల మ్యాప్‌లను, ఇండ్ల జాబితాలను సేకరించాలి. ప్రశ్నావళి రూపకల్పన, సర్వే నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు నిపుణుల కమిటీనీ ఏర్పాటుచేయాలి. ఆ సర్వేకు, డాటాకు ప్రామాణికత ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందులో ఏ ఒక్క దానిని అనుసరించలేదు. ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. దీనికి ప్రామాణికత ఉండబోదు. ఈ సర్వే న్యాయస్థానాల ఎదుట చెల్లుబాటు కావడం కష్టమే. బీహార్ తదితర రాష్ర్టాల అనుభవాలే అందుకు ఉదాహరణలు.
అవుననే చెప్పాలి. ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదు. ప్రామాణికమైన ఇండ్ల జాబితాను ఇవ్వలేదు. గణకులే స్వచ్ఛందంగా ఇండ్ల స్టిక్కరింగ్ చేశారు. గృహ యజమానులు అంగీకరించిన ఇండ్లకే స్టిక్కర్లు వేశారు. విముఖత చూపిన వారి ఇండ్లను వారు మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లను మినహాయించారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మరింత దారుణంగా సాగింది. సగానికిపైగా ఇండ్లను సర్వే చేయలేదనే తెలుస్తున్నది. స్టిక్కరింగ్ చేసిన ఇండ్ల యజమానులు సైతం అరకొరగానే సమాచారం ఇచ్చారు. అందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళిలోని ప్రశ్నలే కారణం.
గృహ యజమానులు చెప్పిన సమాచారాన్నే ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్నారు. అది వాస్తవమా? కాదా? అని పరిశీలనకు ఎక్కడా ఆస్కారం లేకుండా పోయింది. చాలామంది గృహయజమానులు ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపారు. సర్వేలో పాల్గొన్న చాలామంది తమ కుటుంబీకుల వివరాలు, కులం మినహా మరే వివరాలనూ వెల్లడించేందుకు ముందుకురాలేదు. దీంతో సర్వే సజావుగా సాగలేదని తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కులసంఘాలు, మేధావులు మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీ లేవు. అయితే ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం మాత్రమే ఇతమిత్థంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. ఇలా బీసీలు, ఇతర వెనకబడిన వర్గాలకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన కే కృష్ణమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2010లో కీలకమైన తీర్పును ఇచ్చింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు ఆర్టికల్ 340 ద్వారా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ మాత్రమే ఆయా వర్గాల రాజకీయ వెనుకబాటుతనాన్ని గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో స్వతంత్రంగా అధ్యయనం చేయాలని, ఆపై మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ సిఫారసులు చేయాలని నిర్దేశించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లను కల్పించవద్దని తేల్చిచెప్పింది. వీటినే ట్రిపుల్ టీ మార్గదర్శకాలు అంటారు. ఆ తీర్పును దేశంలోని అన్ని రాష్ర్టాలు పాటించాల్సిందేనని మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కరాఖండిగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
శాస్త్రీయ పద్ధతిలో సర్వేచేసి, ప్రామాణికమైన గణాంకాలను సేకరించి సహేతుకమైన వాదనలు వినిపిస్తే అవకాశం ఉంటుది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఆ స్ఫూర్తి చూపలేదు. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది తప్ప విధులు, నిధులు ఇవ్వనేలేదు. వాస్తవంగా డెడికేటెడ్ కమిషనే గణాంకాల సేకరణతోపాటు, అధ్యయనం చేయాలి. ప్రభుత్వం ఇచ్చే గణాంకాలపై ఆధారపడి రిజర్వేషన్లను నిర్ణయించకూడదు. అది సుప్రీంకోర్టు ట్రిపుట్ టీ మార్గదర్శకాలకు విరుద్ధం. అలా స్థిరీకరించిన రిజర్వేషన్లు చెల్లబోవు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిన అమలు చేయబోయి బోల్తాపడ్డది. ఆ తర్వాత సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకుపోయింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వం డెడెకేటెడ్ కమిషన్ ఏర్పాటుచేసింది. కానీ డాటా సేకరణను ప్రణాళిక శాఖ ద్వారా చేయించింది. ప్రామాణికత లేని గణాంకాల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసే రిజర్వేషన్ల సిఫారసులు న్యాయపరంగా నిలబడవు. బీసీల రిజర్వేషన్లే పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకపోతే బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన ముందుకుపోతున్నారని భావించాల్సి వస్తుంది.
ప్రభుత్వం ఇటీవలే ఇంటింటి సర్వే నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు తెలిపింది. అందులో స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలను వివరించింది. అయితే ఆ గణాంకాలేవీ వాస్తవ లెక్కలను ప్రతిబింబించడం లేదు. పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు బీసీల జనాభా శాతమే.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 57.1 శాతం, ఎన్హెచ్ఎఫ్ఎస్ 5 ప్రకారం 58.2 శాతం బీసీ జనాభా ఉంటుందని అంచనా. ఎన్ఎస్ఎస్వో (నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) 2019, 2020-21లో నిర్వహించిన 77, 78 రౌండ్ సర్వే ప్రకారం 57 శాతం ఉంటుందని అంచనా వేశాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నివేదించిన గణాంకాల మాత్రం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమే కావడం గమనార్హం. అందుకే సర్వే గణాంకాలు వాస్తవ లెక్కలను ప్రతిబింబించడం లేదు.