హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశం హర్షించదగ్గ పరిణామమని యూపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ సైనికాధికారి డాక్టర్ హిమాంశు అన్నారు. కేసీఆర్ గొప్ప విజనరీ అని, అందుకు తెలంగాణ మాడల్ సాక్ష్యమని చెప్పారు. ప్రధాని మోదీ గొప్పగా చెప్పుకొనే గుజరాత్ మాడల్ అట్టర్‌ఫ్లాప్ అని, దేశానికి తెలంగాణ మాడల్ కావాలని మాజీ ప్రధానులు వీపీసింగ్, చంద్రశేఖర్లతో కలిసి పనిచేసిన హిమాంశు నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో చెప్పారు.
తెలంగాణ సీఎం జాతీయ రాజకీయాల్లోకి రావడంపై మీ అభిప్రాయం?
ఎనిమిదేండ్ల స్వల్పకాలంలో తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి లో మౌలిక సమస్యలకు పరిష్కారం చూపా రు. 24 గంటల నిరంతరాయ విద్యుత్తును వ్యవసాయానికే కాదు, అన్ని రంగాలకు అందించడం చాలాపెద్ద అచీవ్మెంట్. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.
ఇది తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం. పారదర్శకత, కచ్చితమైన సమయంలో పూర్తిచేయాలనే పట్టుదల కలిగిన నేత. వీపీ సింగ్, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ తరువాత గడిచిన 30 ఏండ్ల కాలంలో అంతటి గొప్పనేత దేశ రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు కేసీఆర్ కనిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి ఆయన రావడం శుభపరిణామం. అది చారిత్రక అవసరం కూడా. కేసీఆర్ రాకను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. దేశానికి సారథ్యం వహించాలని కోరుకుంటున్నా.
గుజరాత్, తెలంగాణ అభివృద్ధి మాడల్స్ చూస్తున్నారు? దేశప్రగతికి ఏది అవసరం?
గుజరాత్ అభివృద్ధి మాడల్ అట్టర్‌ఫ్లాప్. తెలంగాణ అభివృద్ధి మాడల్ ఆదర్శవంతమైనది. తెలంగాణ మాడలే దేశానికి రోల్‌మాడల్ కానున్నది. యావత్ భారత ప్రజానీకం అదే కోరుకుంటున్నది. బీజేపీని నిలువరించేంత అనుభవం రాహుల్‌గాంధీకి లేదు. ప్రస్తుతం మోదీని దీటుగా ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు.
జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావం చూపగలరా?
కచ్చితంగా. ఒక్క మాట చెబుతాను. నరేంద్రమోదీ మొదట ప్రాంతీయ నాయకుడే. ఊకదంపుడు ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వినూత్న పథకాలతో జాతీయ రాజకీయాల్లో కచ్చితమైన ప్రభావం చూపుతారు. అంతటి సత్తా ఆయనకే ఉన్నది.
దేశంలో మరో జాతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందా?
75 ఏండ్ల స్వంతంత్ర పాలనలో గతంలోని కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ దేశ వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. దేశంలో మొట్టమొదటి సారిగా రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే. తెలంగాణ ప్రభుత్వ విధానాలు యావత్ దేశానికి అత్యవసరం. అందుకోసమే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా దేశానికి మరో పార్టీ కచ్చితంగా అవసరమున్నది.